‘ట్వీట్‌’లో కాలేసిన సీఎం కార్యాలయ సిబ్బంది | Sakshi
Sakshi News home page

‘ట్వీట్‌’లో కాలేసిన సీఎం కార్యాలయ సిబ్బంది

Published Thu, Dec 22 2016 2:58 PM

‘ట్వీట్‌’లో కాలేసిన సీఎం కార్యాలయ సిబ్బంది

న్యూఢిల్లీ: ఓ వాక్యములో చిన్న పదం తప్పు దొర్లితే అర్థం మారిపోతుంది. బాధ్యత గల హోదాలో ఉన్నవారు ఇలాంటి పొరపాట్లు చేస్తే వివాదం అవుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం సిబ్బంది పొరపాటుగా చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

చైనాకు చెందిన ప్రతినిధి బృందం కర్ణాటక సీఎంను కలిసింది. బెంగళూరు అభివృద్ధి ఇతర విషయాల గురించి వారు సిద్ధరామయ్యతో చర్చించారు. అనంతరం కర్ణాటక సీఎం పేరుతో ఆయన కార్యాలయ సిబ్బంది.. ‘చైనాలోని సియాచిన్‌ ప్రావిన్స్‌ నుంచి లీ జోంగ్‌ సారథ్యంలో వచ్చిన బృందంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పలు విషయాలు చర్చించారు’ అని ట్వీట్‌ చేసింది. విషయం ఏంటంటే సియాచిన్‌ అనేది వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో గల హిమాలయ పర్వత శ్రేణి. చైనాలో సిచువాన్‌ అనే ప్రావిన్స్‌ ఉంది. కర్ణాటకకు వచ్చిన బృందం ఈ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు. కాగా కర్ణాటక సీఎం కార్యాలయం చేసిన ట్వీట్‌లో సియాచిన్‌ ప్రాంతం చైనాలో ఉన్నట్టుగా అర్థం వచ్చేలా ఉంది. ఈ ట్వీట్‌ చూడగానే రాజకీయ వర్గాలు, నెటిజన్లు విమర్శలకు పదును పెట్టారు. ‘సియాచిన్‌ చైనాలో ఉందా? ప్రతినిధి బృందం సిచువాన్‌ ప‍్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు’ అని కొందరు ట్వీట్‌ చేశారు. ‘ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సియాచిన్‌కు, సిచువాన్‌కు గల తేడా చెప్పేవారు లేరా?’ అని మరికొందరు విమర్శించారు.

Advertisement
Advertisement