Sakshi News home page

గాలం వేస్తారు..గుల్ల చేస్తారు.. !

Published Mon, Mar 31 2014 1:01 AM

'92' series that focused lottery fraud

సాక్షి,సిటీబ్యూరో: ‘సార్ మీ మొబైల్ నెంబర్ లాటరీలో గెలిచింది..కంగ్రాట్స్..అయితే మీరు పన్నులు, ఇతరత్రా కలిపి కొంత మొత్తాన్ని బ్యాంకులో జమచేయాలి’ అని చెప్పి అమాయక జనాన్ని దోచుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ నుంచి ‘+ 92’ నెంబర్‌తో ఫోన్లు చేసి లాటరీ పేరుతో నిండా ముంచుతున్నట్లు తేలింది.

అయితే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని పాక్, దుబాయ్‌లోని నిందితులు మూడు నెలల్లో రూ.3 కోట్లను కొల్లగొట్టారు. ఇందులో ఓ బాధితురాలు సీసీఎస్ డీసీపీ పాలరాజుకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌లో మకాం వేసిన మ్యాడ్యుల్స్ ఉదంతం వెలుగుచూసింది. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని ఆదివారం అరెస్టు చేశారు. వీరినుంచి రూ.20.5 లక్షల నగదు, 73 డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను సైబర్‌క్రైమ్ ఏసీపీ అనురాధతో కలిసి డీసీపీ పాలరాజు తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.

 నగరంలో మ్యాడ్యుల్స్ తయారీ ఇలా : పాకిస్థాన్ కు చెందిన అలిభాయ్, హారుల్‌లు దుబాయ్‌లో నివాసముంటున్నారు. హైదరాబాద్ నుంచి ఉద్యోగ అన్వేషణలో దుబాయ్ వెళ్లిన వారిని వీరు పరిచయం చేసుకుంటారు. తాము చెప్పినట్లు చేస్తే మంచి కమీషన్ వస్తుందని, త్వరగా సంపాదించొచ్చని నమ్మిస్తారు. ఇలా మూడునెలల క్రితం హైదరాబాద్‌లోని వారి బంధువులు, స్నేహితులతో మాట్లాడి ఒక ముఠాను ఏర్పాటు చేశారు. సీతాఫల్‌మండికి చెందిన అమర్‌జిత్ సింగ్ (40), వసంతాల నరేంద్ర(37)లు ఈ ముఠాకు నాయకత్వం వహించారు.

నగరంలోని బోయిన్‌పల్లిలో ఉంటున్న గుజరాత్‌కు చెందిన పటేల్ మహేందర్‌కుమార్ (41), మారేడుపల్లికి చెందిన తాటిపల్లి శంకర్ (34)లతో క లిసి ముఠాను విస్తరించారు. శంకర్ తనకు పరిచయస్తులైన వారు మారేడుపల్లికి చెందిన జి.దయామణి (44), డి.చంద్రశేఖర్ (37),కాప్రాకు చెందిన వీరభద్రారావు (33)లతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో మరో 40 మందితో కలిసి మొత్తం 73 బ్యాంకు అకౌంట్లు తెరిపించారు. ఈ అకౌంట్ నెంబర్లను దుబాయ్‌లోని అలీభాయ్‌కు పంపిస్తారు.

 గాలం వేస్తారు ఇలా..: పాకిస్థాన్‌లోని ఏజెంట్ల నుంచి హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లో ఉన్న అమాయకులకు లాటరీ తగిలిందని గాలం వేస్తారు. ప్రైైజ్ మనీ కావాలంటే అందుకు కావాల్సిన పన్నులు తదితర ఖర్చుల నిమిత్తం పలానా అకౌంట్‌లో డబ్బులు వేయమంటారు. వారి మాటలు నమ్మిన బాధితులు వారు పేర్కొన్న బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తారు. చివరకు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తారు. ఇలా అమీర్‌పేటకు చెందిన టీచర్ మృణాళిని కులకర్ణి (40) సెల్‌కు కూడా ఇటీవలే +92 సిరీస్ నుంచి ఫోన్ వచ్చింది.

ఎయిర్‌టెల్ నెంబర్‌కు రూ.33 లక్షలు బహుమతి గెలిచారని అగంతకులు ఆమెను నమ్మించారు. అయితే అందుకు పన్నులు, కస్టమ్స్ డ్యూటీ, బ్యాంకు క్లియరెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ తదితర ఖర్చుల నిమిత్తం ఏజెంట్లకు చెందిన బ్యాంకు అకౌంట్‌లో సుమారు రూ.13 లక్షల వేయించుకున్నారు. చివరకు ఆమె మోసపోయానని గ్రహించి రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మాజిద్‌అలీఖాన్, ఎస్‌ఐ వేణుగోపాల్‌లు బాధితురాలు డబ్బులు వేసిన బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఖాతాదారుడిని అదుపులోకి తీసుకుని విచారిచండంతో నగరంలో మకాం వేసిన ముఠా ఉదంతం వెలుగుచూసింది. దీంతో పైన పేర్కొన్న ఏడుగురిని అరెస్టు చేశారు.

హవాలా ద్వారా..: బాధితులు ఇక్కడి బ్యాంకులు డిపాజిట్ చేసిన డబ్బులను నిందితులు డెబిట్ కార్డుల ద్వారా డ్రా చేసి హవాలా ద్వారా దుబాయ్‌లోని అలీభాయ్‌కు పంపిస్తారు. ఇలా పంపినందుకు 10 శాతం కమీషన్‌ను ఇక్కడి ముఠాకు అందుతుంది. ఇందులోంచే బ్యాంకు అకౌంట్‌దారులకు, ఏజెంట్లకు పంపకాలు చేసుకుంటారు.

40 మందిని అరెస్టు చేయాల్సి ఉంది: డీసీపీ పాలరాజు
 ఇలాంటి ముఠాను అరెస్టు చేయడం ఇది రెండోది. గతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని అరెస్టు చేయగా ఈ సారి నగరంలోనే మకాం వేసిన వారిని పట్టుకున్నాం. ఈ కేసులో బ్యాంకు ఖాతాలు తెరిచిన మరో 40 మందిని అరెస్టు చేయాల్సి ఉంది.

Advertisement

What’s your opinion

Advertisement