ఈవో x ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

ఈవో x ఉద్యోగులు

Published Mon, Jun 9 2014 2:40 AM

ఈవో x ఉద్యోగులు - Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈవో రఘునాథ్, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈవో వేధిస్తున్నార ని ఆరోపిస్తూ సహాయ నిరాకరణ చేపట్టిన ఉద్యోగులు, అర్చకు లు ఆందోళనను ఉధృతం చేశారు. ఈవో పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మం డపానికి ఎదురుగా ఆదివారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. దేవస్థానం స్థానాచార్యులు కె.ఇ.స్థలశాయి, ఉపప్రధానార్చకులు కోటి రామస్వరూప్ రాఘవాచార్యులు, ఎస్.శ్రీనివాసాచార్యులు, అర్చకులు బి.రామకృష్ణబాబు, ఉద్యోగులు కె.సతీష్, టి.వెంకటరత్నం, కృష్ణమాచారి, వెంకన్న దీక్షల్లో కూర్చున్నారు.
 
భక్తులకు అంతరాయం...
ఉద్యోగులు, అర్చకులు రిలే నిరాహార దీక్ష చేస్తుండడంతో ఆదివారం భక్తులకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో స్వామివారికి చేరువగా వెళ్లి పూజలు చేయించుకోవాలనుకున్న భక్తులు సాధారణ పూజలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు, ఆదివారం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అయితే అందరికీ సరిపడా ప్రసాదం(పులిహార) అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఆలయ ఉద్యోగులంతా సహాయ నిరాకరణలో ఉండటంతో కార్యాలయ తలుపులు కూడా తెరుచుకో లేదు.
 
ముదురుతున్న వివాదం...
రామాలయంలో ఈవో, అర్చకులకు మధ్య తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఈవో వివిధ కారణాలతో ఉద్యోగులను వే ధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటి వరకూ వినిపించ గా, ఇది మత పరమైన అంశాలకు ముడిపడటంతో వివాదం మరింత రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవో రఘునాధ్ కూడా ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధర్వణ వేదపండితులైన జి.మురళీ కృష్ణమాచార్యులను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు ఈవోకు అనుకూలంగా ఉన్న అర్చకులు అంటున్నా రు.
 
 కాగా, మత పరమైన ఈ వివాదంలో ఆలయం బయట ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు కూడా కల్పించుకోవటంతో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో కల్పించుకొని వివాదం సమసిపోయేలా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
 
దీక్షలకు జేఏసీ మద్దతు...
అర్చకులు, ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను జేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రారంభించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆలయ ఉద్యోగులు, అర్చకులకు ఈవో ఇచ్చిన మెమోలను వెంటనే  వెనక్కు తీసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్‌లను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను ఈవో వేధిస్తున్నారనే విషయాన్ని ఇప్పటికే టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
 
ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈవోపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన మెమోలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలన్నారు. ఈవో ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు రవీందర్, నిరంజన్ కుమార్, పీఆర్‌వో సాయిబాబా పాల్గొన్నారు. కాగా దీక్షలకు పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎస్‌కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ  సంఘీభావం తెలిపారు.

Advertisement
Advertisement