సమృద్ధిగా పాడి పంటలు | Sakshi
Sakshi News home page

సమృద్ధిగా పాడి పంటలు

Published Mon, Mar 31 2014 11:22 PM

సమృద్ధిగా పాడి పంటలు - Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్: శ్రీ జయనామ సంవత్సరం స్ఫూర్తితో పాలనా యంత్రాగం జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తోందని కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. ఆదివారం శ్రీ జయనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాన ద్వారం నుంచి వేదిక వరకు కలెక్టర్‌కు స్వాగతం పలికారు.
 
అనంతరం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ జయనామ సంవత్సరంలో రైతులు పాడి పంటలు, సుఖసంతోషాలతో ఉంటారని పంచాంగం ద్వారా తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. జిల్లాలోని విద్యార్థులంతా బాగా చదివి మరింత వృద్ధిలోకిరా వాలని, వీరి ద్వారానే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
 
ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెడుతోందని, వాటి ఫలాలు అర్హులకు చేరేలా యంత్రాంగానికి సహాయ సహకారాలందించాలని అన్నారు. కవుల సందేశాలు మంచి ప్రేరణ ఇచ్చాయని, అందరికీ జయం కలగాలని కోరారు. జేసీ శరత్ మాట్లాడుతూ కాలగమనంతో ముడిపడిన పండుగ ఉగాది అన్నారు. అన్ని పండుగలకు దేవుడు ఉంటే ఈ పండుగకు నక్షత్ర గమన ఆధారంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. వేద పండితులు బోర్పట్ల హన్మంతాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు.
 
జిల్లాకు ఆదాయం 8, వ్యయం రెండుగా ఉంటుందన్నారు. ధరలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పారు. రాజకీయాల గొడవలు స్వల్పంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. వర్షాలపై ఆధారం లేని పంటలు అధికంగా పండుతాయని తెలిపారు. చెరకు, గోధుమలు, శనగలు, ఎర్రధాన్యం, పసుపు పంటలు అధికంగా పండుతాయని చెప్పారు. పట్టణంలోని కవులు, ఉపాధ్యాయులు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం షఢ్రుచుల పచ్చడిని సేవించారు.
 
వేద పండితులకు, కవులకు జిల్లా యంత్రాంగం తరఫున సన్మానం చేశారు. డీఆర్‌ఓ దయానంద్, ఏఓ శివకుమార్, జిల్లా అధికారులు లక్ష్మారెడ్డి, ఏడీ వెంకటరమణ, లక్ష్మణాచారి, శ్రీనివాస్‌రెడ్డి, జగన్నాథరెడ్డి, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్, మనోహర్‌చక్రవర్తి, భానుప్రకాష్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. కాగా కలెక్టర్ ఉగాది వేడుకులకు తన కొడుకు, కూతురుతో హాజరయ్యారు.

Advertisement
Advertisement