నీటి కోసం జులుం | Sakshi
Sakshi News home page

నీటి కోసం జులుం

Published Sat, Feb 14 2015 12:51 AM

నీటి కోసం జులుం - Sakshi

సాగర్ డ్యాంపై ఆంధ్ర అధికారుల ఓవరాక్షన్
 
ఏకంగా గేట్లు ఎత్తుతామని దౌర్జన్యం
అడ్డుకోబోయిన తెలంగాణ పోలీసులపై ముష్ఠిఘాతాలు
తిరగబడి లాఠీలెత్తిన మన పోలీసులు
ఉన్నతాధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అతిక్రమించి నీళ్లు విడుదల చేయాలని అక్కడినుంచి ఉత్తర్వులు
ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తెలంగాణ పోలీసుల ప్రతిఘటన
తాగునీటి అధికారులతో కలిసి వచ్చిన ఆంధ్ర పోలీసుల బరితెగింపు

 
నాగార్జునసాగర్ నీటి కోసం జులుం ప్రదర్శించారు ఆంధ్రా అధికారులు. నీటి విడుదల విషయంలో కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. శుక్రవారం ఏకంగా గేట్లను ఎత్తుతామని ఆంధ్రా అధికారులు ప్రాజెక్టు వద్ద హల్‌చల్ సృష్టించారు. వీరికి ఆ రాష్ట్ర పోలీసులు తోడయ్యారు. ఇది సరికాదని, అడ్డుకోబోయిన తెలంగాణ పోలీసులపైనే ముష్ఠిఘాతాలు కురిపించారు.
 
నాగార్జున సాగర్ : సాగునీటి కోసం ఆంధ్రా అధికారులు ఓవర్‌యాక్షన్ చేశారు. శుక్రవారం ఉదయమే సాగర్ డ్యాంలో సగభాగం తమదేనంటూ కుడికాల్వ హెడ్‌రెగ్యులేటర్ గేట్లు ఎత్తడానికి యత్నించారు. తమ కాల్వకు విడుదల చేసే 2 వేల క్యూసెక్కుల నీరు సరిపోవడం లేదని, 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డ్యాం మీదకు వచ్చారు. అక్కడే ఉన్న మన రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు తమకు ఎలాంటి సమాచారమూ లేదని, నీటి విడుదల పెంపు కుదరదని చెప్పారు.

డ్యాంలో 13 గేట్లు, కుడి కాల్వ తమ రాష్ట్ర పరిధిలోకి వస్తాయని, ఈ ప్రాంతంలో డ్యాంపై ఉన్న వాహనాలు వెంటనే తొలగించి తెలంగాణ రాష్ట్ర అధికారులు, పోలీసులు ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్లిపోవాలని గుంటూరు జిల్లా డీఎస్పీ నాగేశ్వర్‌రావు ఆదేశించారు. దానికి సమాధానంగా మిర్యాలగూడ డీఎస్పీ గోనే సందీప్ వెంటనే స్పందించి తెలంగాణ పోలీస్ బలగాలను అప్రమత్తం చేశాడు. దీంతో డ్యాం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో ఆంధ్రా అధికారులు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఇందుకు మన రాష్ట్ర పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో ఆంధ్రా రాష్ట్ర పోలీసులు.. మన పోలీసులను నెట్టి వేసి ముష్ఠిఘాతాలకు దిగారు. చివరికి చేసేదిలేక  మన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో డ్యాంపై యుద్ధవాతావరణం నెలకొంది. అటు గుంటూరు డీస్పీ, మిర్యాలగూడ డీఎస్పీ సర్దిచెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది.

నీటిని విడుదల చేయాలి..

ఆంధ్రా రాష్ట్ర ఈఎన్‌సీ ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఇచ్చిన ఉత్తర్వులను తీసుకొని తెలంగాణ అధికారులకు చూపించారు. ఈ లేఖను తమ  ఉన్నతాధికారులకు పంపిస్తామని, అక్కడినుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. దీంతో సంతృప్తి చెందని ఆంధ్ర అధికారులు ఇప్పుడే నీటిని విడుదల చేయాలని, కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ తాళాలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్ విభజన చట్టం ప్రకారం డ్యాం నిర్వహణ తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉందని, ఆంధ్ర అధికారులకు నీటిని విడుదల చేయాలని ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని, తాళం చేతులు ఇవ్వబోమని తేల్చిచెప్పారు.

డ్యాం నిర్వహణ అధికారి ఎస్‌ఈ ఇక్కడికి రావాలని, కూర్చొని చర్చిద్దామని ఆంధ్రా అధికారులు అనడంతో ఎస్‌ఈకి పోలీసులు కబురుపెట్టారు. ఆయన వచ్చేంతవరకు ఇరు ప్రాంతాలకు చెందిన పోలీసులు ఒకరిపై ఒకరు నినాదాలు చేశారు. ఇక్కడ జరిగే తతంగమంతా మీడియాలో రావడంతో ఇరు రాష్ట్రాల  ఉన్నతాధికారులు ఫోన్‌లో మాట్లాడి సాయంత్రానికి నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే రాత్రి కావడంతో శనివారం వాయిదావేసి వెళ్లారు. ఇరురాష్ట్ర అధికారులు అర్ధరాత్రి వరకు డ్యాంపైనే ఉన్నారు.

Advertisement
Advertisement