నేను బతికే ఉన్నా.. | Sakshi
Sakshi News home page

నేను బతికే ఉన్నా..

Published Mon, Aug 19 2019 8:15 AM

Anganwadi Women Dead Rumor Spread In Rangareddy - Sakshi

సాక్షి, కొందుర్గు/ రంగారెడ్డి : అంగన్‌వాడీ టీచర్‌ బతికుండగానే మృతిచెందినట్లుగా గ్రామ ముఖ్య కూడలీలో గుర్తుతెలియని వ్యక్తులు బోర్డు తగిలించారు. ఈ సంఘటనతో కొందుర్గు మండలం బైరంపల్లి ఆదివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బైరంపల్లి అంగన్‌వాడీ టీచర్‌ వినోద పౌష్టికాహారం చెత్తకుప్పలో పడేసిందని ఈ నెల 16న గ్రామస్తులు ఐసీడీఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ నాగమణి, సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి అంగన్‌వాడీ టీచర్‌ వినోదకు మెమో జారీ చేశారు. కాగా, ఆదివారం ఉదయం బైరంపల్లి బస్టాండ్‌ వద్ద అంగన్‌వాడీ టీచర్‌ వినోద మృతిచెందిందని బోర్డు తగిలించారు. ఇది చూసిన గ్రామస్తులంతా మనస్తాపంతో చనిపోయిందేమోనని అనుకున్నారు. తోటి అంగన్‌వాడీ టీచర్ల ఫోన్‌తో విషయం తెలుసుకున్న వినోద కొందుర్గు పోలీసులను ఆశ్రయించింది. తానే బతికే ఉన్నానని, కావాలనే కొందరు చనిపోయినట్లుగా గ్రామ కూడలిలో బోర్డు ఏర్పాటు చేశారని బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  
అంగన్‌వాడీ టీచర్లు ధర్నా.. 
అంగన్‌వాడీ టీచర్‌ వినోదను ఉద్దేశపూర్వకంగా హింసిస్తున్నారని, బతికుండగానే చనిపోయినట్లు రాయడం బాధాకరమని కొందుర్గు, జిల్లేడ్‌చౌదరిగూడ మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు మండిపడ్డారు.ఈ సందర్భంగా బైరంపల్లి బస్టాండ్‌ వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి దుండగులను పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 

Advertisement
Advertisement