ప్రారంభానికి ముందే అవార్డుల పంట | Sakshi
Sakshi News home page

ప్రారంభానికి ముందే అవార్డుల పంట

Published Mon, Nov 20 2017 10:13 AM

Awards to Metro Project Specila Story - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: తీరైన ఒంటిస్తంభం పిల్లర్లపై మెట్రో రైళ్ల పరుగులు..పక్షి రెక్కల ఆకృతిలో మినీ విమానాశ్రయాన్ని తలపించేలా సువిశాల మెట్రో స్టేషన్లు....అత్యాధునిక డిజైన్లు...ఆకాశమార్గాలు...వీక్షకులను మంత్రముగ్థులను చేసేలా స్టేషన్లలో వసతులు....ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద మెట్రో ప్రాజెక్టుల్లో ఉన్న మేలిమి లక్షణాలు, వసతులు, సౌకర్యాల కలబోత మన మెట్రో ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు ఐదేళ్లుగా 2500 మంది నిపుణు లైన ఇంజినీర్లు డిజైన్, డ్రాయింగ్, స్ట్రక్చర్, సైట్‌లలో అహరహం శ్రమిస్తున్నారు. డిజైన్లకు అనుగుణంగా ప్రాజెక్టును తీర్చిదిద్దే పనిలో సుమారు 18 వేల మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. సుమారు రూ.16 వేల కోట్ల అంచనావ్యయంతో పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) నిర్మిస్తున్న ప్రాజెక్టు మన మెట్రో. ప్రపంచంలోనే పీపీపీ విధానంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే.

ఇక పిల్లర్లు, మెట్రో డిపోలు, ఆపరేషన్‌కంట్రోల్‌ సెంటర్, మెట్రో పట్టాలు, డ్రైవర్‌ అవసరంలేని కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థ..కాంక్రీట్‌ టెక్నాలజీ తదితర అంశాల్లో మన మెట్రో ప్రాజెక్టుకు అవార్డుల పంట పండింది. ఇప్పటికే దేశవిదేశాలకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థలు గత ఐదేళ్లుగా వివిధ అంశాల్లో మన మెట్రో ప్రాజెక్టుకు అవార్డులను ప్రదానం చేయడం విశేషం. మెట్రో స్టేషన్ల పరిసరాలను మూడు భాగాలుగా విభజించి రహదారి మార్గంలో చేపట్టిన సుందరీకరణ, హరిత తోరణం.. మొజాయిక్‌టైల్స్, స్ట్రీట్‌ఫర్నీచర్‌...మియాపూర్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ప్రజోపయోగ స్థలాలకు ఇటీవల ఐజీబీసీ సంస్థ ప్లాటినం రేటింగ్‌ సైతం ఇచ్చిన విషయం విదితమే. అంతేకాదు..మన మెట్రోకు ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 15 అవార్డులు మెట్రో కీర్తికిరీటంలో కలికితురాయిల్లా భాసిల్లుతుండడం విశేషం. ఇందులో న్యూయార్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫోరం,రాయల్‌సొఐటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాక్సిడెంట్‌ గోల్డ్‌లు సైతం ఉన్నాయి.

మన మెట్రోను వరించిన అవార్డులివే..
గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌(2013) న్యూయార్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫోరం ప్రధానం చేసిన అవార్డు.
2013, 14,15: రాయల్‌ సొసైటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాక్సిడెంట్‌ గోల్డ్‌ అవార్డులు మూడు పర్యాయాలు వరుసగా దక్కాయి. నిర్మాణ సమయంలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటించినందుకు యూకెకు చెందిన గ్లాస్కో సంస్థ ప్రధానం చేసిన సేఫ్టీ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అవార్డులు దక్కాయి.
2013,14: బెస్ట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ అవార్డ్‌.
2015,17: బెస్ట్‌ అప్‌కమింగ్‌ మెట్రో అవార్డు.(కన్‌స్ట్రక్షన్‌ వీక్‌ ఆఫ్‌ ఇండియా–ముంబాయి.)
అమెరికన్‌ కాంక్రీట్‌ ఇన్సిట్యూట్‌(ఏసీఐ అవార్డ్‌)–2013–ముంబాయి.
ఇంటర్నేషనల్‌ సేఫ్టీ, క్వాలిటీ, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డ్‌–2015 యూకెకు చెందిన ఐఎస్‌క్యూఈఎం సంస్థ
ప్లాటినం అవార్డ్‌–2016
బెస్ట్‌ అప్‌కమింగ్‌ మెట్రోరైల్‌–ఐటీపీ పబ్లిషింగ్‌ గ్రూప్‌–న్యూఢిల్లీ
ఐజీబీసీ ప్లాటినం రేటింగ్‌(మెట్రో స్టేషన్లకు)–2017

Advertisement
Advertisement