బోధన్‌లో వికసించని కమలం | Sakshi
Sakshi News home page

బోధన్‌లో వికసించని కమలం

Published Thu, Nov 15 2018 11:54 AM

BJP Loosing Hopes In Nizamabad District - Sakshi

భారతీయ జనతా పార్టీ బోధన్‌ నియోజక వర్గంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, గతంలో పోటీ చేసిన రెండుసార్లు ఆ పార్టీ ఓటమి మూటగట్టుకుంది. రాజకీయ కారణాల కంటే అంతర్గత విభేదాలు, నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా బోధన్‌ లో ‘కమలం’ వికసించ లేక పోయింది.  అయితే, ఈసారి ఎలాగైనా సత్తా చాటి, బోధన్‌లో పాగా వేయాలని ఆ పార్టీ కార్యకర్తలు గట్టి పట్టుదలతో ఉన్నారు. నియోజక వర్గంలో మంచి పట్టున్న బీజేపీ ఇప్పటి దాకా జరిగిన తప్పులను సరి చేసుకుని విజయతీరాలకు చేరుతుందా.. లేక, మళ్లీ బొక్క బోర్లాపడుతుందా? అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. విభేదాలను పక్కన పెడితే సత్తా చాట వచ్చని విశ్లేష కులు పేర్కొం టున్నారు.

సాక్షి, బోధన్‌: పట్టున్న బోధన్‌ నియోజకవర్గంలో బీజేపీ ఇప్పటివరకు సత్తా చాటలేక పోయింది. బలం, బలగం ఉండి కూడా ఆ పార్టీ ఇక్కడ తిష్ట వేయలేక పోయింది. రాజకీయ సమీకరణలకు తోడు పార్టీ నేతల మధ్య విభేదాల కారణంగా ఇప్పటివరకు బోధన్‌లో కమలం వికసించ లేకపోయింది. వాస్తవానికి నియోజక వర్గంలో బిజేపీకి బలమైన సంప్రదాయ ఓటు బ్యాంక్, కార్యకర్తలు ఉన్నా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు. పలు మార్లు ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థులంతా ఓటమి చెందారు.

రాజకీయ పరంగా, పార్టీ సంస్థాగతంగా కొంత వరకు బలంగానే ఉన్నా.. నియోజకవర్గ స్థాయి నేతల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు కారణంగా బీజేపీ ఓటమికి ప్రధాన కారణమవుతోంది. అంతర్గత విభేదాల వల్లే బీజేపీ విజయ తీరాలకు చేరడం లేదని రాజకీయ విశ్లేషకుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.  నియోజక వర్గ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీని వదలి వెళ్లారు. కేంద్రంలో అధికార పక్షంగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా ఉన్న బీజేపీ బోధన్‌ నియోజక వర్గంలో ఏళ్లుగా అధికార పీఠం అందుకోలేక పోయింది. నియోజకవర్గ పరిధిలోని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో బలమైన పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు. అలాగే, బోధన్‌ మున్సిపాలిటీలో ముగ్గురు పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. అయినా, అసెంబ్లీ ఎన్నికల్లో కమలం విజయం అందుకోలేక పోతోంది. 

గట్టి పోటీ..!
1952లో బోధన్‌ నియోజక వర్గం ఏర్పడింది. అయితే, ఇక్కడ బీజేపీ తొలిసారి పోటీ చేసింది మాత్రం 1994 ఎన్నికల సమయంలోనే.. బీజేపీ అభ్యర్థిగా సీనియర్‌ న్యాయవాది నర్సింహారెడ్డి బరిలోకి దిగారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థి, మైనారిటీ నేత బషీరుద్దీన్‌బాబుఖాన్‌తో చివరి క్షణం వరకు హోరాహోరీగా గెలుపు కోసం ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో నర్సింహారెడ్డికి 30,396 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన 1999, 2004 ఎన్నికల్లో పోటీకి బీజేపీ పోటీ చేయలేదు. 2009లో బోధన్‌ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్‌ శివప్ప అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 8,594 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ మహాకూటమి, ప్రజారాజ్యం పార్టీలు హోరాహోరీగా తలపడిన సందర్భంలో కూడా బీజేపీ అభ్యర్థి ప్రభావం చూపగలిగారు. 2014 ఎన్నికల్లో కమలం పార్టీ పోటీలో లేదు.  

సత్తా చాటాలని ఆరాటం.. 
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సమాయాత్తమవుతోంది. నియోజక వర్గానికి చెందిన పలువురు నాయకులు టికెట్‌ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అధిష్టానం ఇప్పటివరకు పార్టీ అభ్యర్థి పేరును ఖరారు చేయలేదు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మూడు, నాలుగు రోజులు గడిచినా అభ్యర్థి పేరు ఖరారు కాకపోవడంతో ఆశావహులతో పాటు పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. అయితే, నేడో, రేపో ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఖరారు అవుతోందని పెద్దలు చెబుతుండడంతో కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో సత్తా చాటి బోధన్‌లో పాగా వేయాలని పట్టుదలగా ఉన్నారు.   

Advertisement
Advertisement