బీఎల్‌ఎఫ్‌ దేశ రాజకీయాల్లో పెద్ద మలుపు | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఎఫ్‌ దేశ రాజకీయాల్లో పెద్ద మలుపు

Published Fri, Jan 26 2018 1:45 AM

BLF is a big turn in the politics of the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బహుజన వామపక్ష వేదిక(బీఎల్‌ఎఫ్‌) ఆవిర్భావం దేశ రాజకీయాల్లో పెద్ద ముందడుగని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో సంక్షోభం తీవ్రంగా ఉన్న ఈ దశలో ప్రత్యామ్నాయ రాజకీయాల అవసరం ఉందని, వ్యక్తుల ఆధారంగా కాకుండా, విధానాల ఆధారంగానే ప్రత్యామ్నాయ రాజకీయాలు నడవాలని అభిప్రాయపడ్డారు. ఇపుడు దేశంలో రాజకీయ వాతావరణం మారుతోందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం 28 రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలతో బీఎల్‌ఎఫ్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు ఏచూరి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.  

ప్రజా ఉద్యమం రావాలి.. 
సభలో ఏచూరి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక దోపిడీలు యథేచ్ఛగా సాగుతున్నాయని, ప్రత్యామ్నాయ రాజకీయ విధానం తేవాలంటే ప్రజా ఉద్యమం జరగాలన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, గోరక్ష దళాలపై నిషేధం విధించమంటే మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దేశంలో మోరల్‌ పోలీసింగ్‌ పెరిగిపోయిందని పేర్కొన్నారు. మనుస్మృతి ఆధారంగా పాలించాలని చూస్తూ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, ఎన్నికల్లో హామీలు ఇచ్చి, ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి రావడం మినహా ఎలాంటి మార్పు లేదని అన్నారు. ప్రజా పోరాటాల ద్వారా బీఎల్‌ఎఫ్‌ను బలపరచాలని ఏచూరి పిలుపునిచ్చారు. 

93 శాతంగా ఉన్న  ప్రజలకే అధికారం దక్కాలి 
దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో 93 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఉన్నారని, వీరి చేతుల్లోకి అధికారాన్ని తేవడమే బీఎల్‌ఎఫ్‌ ప్రత్యేక ఎజెండా అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 28 పార్టీలతో ఏర్పాటైన బీఎల్‌ఎఫ్‌ ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అన్న స్పష్టమైన అవగాహనతో ఉందని, ఎర్రజెండా–నీలి జెండా అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు పోటీలో ఉంటారని ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో బీఎల్‌ఎఫ్‌ నిర్మాణం కొనసాగుతుందని, మే నెలలో నియోజకవర్గాల్లో జైత్రయాత్ర మొదలు పెడతామన్నారు. కాగా, 41 మందితో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది. నల్లా సూర్యప్రకాశ్‌ చైర్మన్‌గా, నలుగురు వైస్‌ చైర్మన్లుగా, తమ్మినేని వీరభద్రం సహా ఏడుగురిని కన్వీనర్లుగా ఎంపిక చేశారు. సభలో టి–మాస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య, ఎంసీపీఐ జాతీయ కార్యదర్శి గౌస్, మల్లు స్వరాజ్యం, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ లౌకికవాద పార్టీ కాదు: ప్రకాశ్‌ అంబేడ్కర్‌ 
దేశంలో బీజేపీ అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని, దేశానికి ప్రధాని మోదీ అత్యంత ప్రమాదకారి అని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. ముస్లింలను అకారణంగా ద్వేషిస్తున్నారని, హిందువుల్లో స్లీపర్‌ సెల్స్‌ అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇంకెంత మాత్రం లౌకికవాద పార్టీ కాదని, అది ఆర్‌ఎస్‌ఎస్‌కు బి టీమ్‌గా మారిపోయిందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని, అంతా ఒక్కటై రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. 

సీపీఐనీ చేర్చండి  సురవరంను కోరిన సీతారాం ఏచూరి 
ప్రత్యామ్నాయ రాజకీయ విధానం తో రాష్ట్రంలో ఏర్పడిన బీఎల్‌ఎఫ్‌లో సీపీఐని కూడా భాగస్వామి చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని సీతారాం ఏచూరి కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్‌తో కలసి హైదరాబాద్‌లో ఉంటున్న సురవరంను ఆయన నివాసంలో కలిశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఉభయులూ చర్చించారని సీపీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీపీఐ బీఎల్‌ఎఫ్‌లో చేరితే మరింత బలోపేతం అవుతుందని, దానికి తెలంగాణ సీపీఐ సమితి సానుకూలంగా నిర్ణయం తీసుకునేట్లు చొరవ తీసుకోవాలని సుధాకర్‌రెడ్డిని ఏచూరి కోరారు.   

Advertisement
Advertisement