నత్తలా నడుస్తూనే.. | Sakshi
Sakshi News home page

నత్తలా నడుస్తూనే..

Published Tue, Nov 14 2017 1:10 AM

Bodhan and eamcet scam cases are still in pending - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు కుంభకోణాల కేసులు ఇంకా ‘నానుతూనే’ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి ఏడాదిన్నర గడిచినా చార్జిషీటు దాఖలుకాని ఎంసెట్‌ కేసు ఒకటికాగా.. రాష్ట్ర ఖజానాకు వందల కోట్లు కన్నం వేసిన బోధన వాణిజ్య పన్నుల కుంభకోణం మరొకటి. రెండు కేసులూ సీఐడీ చేతుల్లో ఉన్నా.. దర్యాప్తు మాత్రం ‘సాగుతూనే’ఉంది. కేవలం నోటీసులు, లేఖలు, ప్రశ్నించడాలతోనే సరిపోతోంది. ఈ నాన్చివేత ధోరణిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

‘ఎంసెట్‌’పై కొత్త సందేహాలు? 
2016 ఆగస్టులో ఎంసెట్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ ప్రారంభించిన మొదట్లో సీఐడీ చురుగ్గా వ్యవహరించినట్లు కనిపించింది. 68 మంది బ్రోకర్లు, 16 మంది సూత్రధారులను పట్టుకోగలిగింది. అయితే ఓ కీలక సూత్రధారి కస్టడీలో మృతిచెందగా, ప్రశ్నపత్రం లీక్‌ చేసిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు చార్జిషీట్‌ దాఖలు చేయలేదు. డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ సిద్ధం చేసి నాలుగు నెలలు గడిచింది. ఇది అటు కోర్టుకు వెళ్లక, ఇటు తుది దశకు చేరక సందిగ్ధ పరిస్థితి నెలకొంది. దీనిపై సీఐడీ అధికారులను వివరణ కోరగా... జేఎన్టీయూకు లేఖలు రాశామని, ప్రశ్నపత్రం తయారీ కమిటీ, ఆ కమిటీ మినిట్స్‌ తదితర సమాచారం కావాలని కోరామని చెబుతోంది. అంటే దర్యాప్తు దాదాపు పూర్తయి డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ సిద్ధమయ్యాక మళ్లీ విచారణ యూటర్న్‌ తీసుకోవడం, జేఎన్టీయూ అధికారులపై అనుమానాలు లేవంటూనే మళ్లీ నోటీసులిచ్చి మినిట్స్‌ కావాలనడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. చార్జిషీట్‌ రూపొందించడానికి ముందే ఈ నోటీసులు ఎందుకు జారీచేయలేదు. అప్పుడే ఈ కోణంలో ఎందుకు విచారణ సాగించలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

వందల కోట్లు గండికొట్టినా చర్యల్లేవు.. 
రాష్ట్ర ఖజానాకు రూ.450 కోట్లకుపైగా కుచ్చుటోపీ పెట్టిన బోధన్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ కుంభకోణం వ్యవహారం సీఐడీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి చివరలో కేసు నమోదు చేసిన సీఐడీ.. పాత్రధారులుగా ఉన్న 8 మంది అధికారులను, ఇద్దరు సూత్రధారులను అరెస్టు చేసింది. కానీ ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన డిస్టిబ్యూటర్లు, ఏజెన్సీలు, ఇతర వ్యక్తులవైపు సీఐడీ కన్నెత్తి చూడకపోవడం సందేహాలను లేవనెత్తింది. రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగానే జాప్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ చలానాలను ట్రెజరీ కార్యాలయాలకు పంపి వెరిఫికేషన్‌ చేయిస్తున్నామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మేలోనే 5,540 నకిలీ చలాన్లు గుర్తించామని, వాటిని చెక్‌ చేసేందుకు సీఐడీ బృందం సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లిందని గతంలోనే ఉన్నతాధికారులు తెలిపారు. కొందరు అధికారులపై విచారణకు ఆ శాఖ ఉన్నతాధికారులు అడ్డుపడ్డారని సీఐడీ ఆరోపించింది. కానీ తర్వాత వారి నుంచి క్లియరెన్స్‌ వచ్చినా... చర్యలు చేపట్టడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారన్నది అనుమానాస్పదంగా మారింది. 

ఇందిరమ్మ కేసు మూసేసినట్లే! 
ఇందిరమ్మ ఇళ్ల కేసును మూసివేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. లబ్ధి దారులు సబ్సిడీ పొందిన సమయం, ఇళ్లు నిర్మించిన సమయం తదితర సరిగా వివరాలు దొరకడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వివరాలు దొరికినా సరైన తేదీల్లోనే లబ్ధిదారులకు చేరినట్టు కొన్నిచోట్ల వెల్లడికావటంతో బలమైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతున్నారు. దీంతో కేసును మూసివేయడమే మేలని సీఐడీ ప్రభుత్వానికి సంకేతాలు పంపింది. ఈ కేసులో సీఐడీకి ముందుకెళ్లే అవకాశం లేదని సీఐడీ ఉన్నతా«ధికారి ఒకరు వెల్లడించారు. 

కొత్త డీజీపీకి సవాలే.. 
ఎంసెట్, బోధన్‌ కుంభకోణాల్లో చార్జిషీట్ల దాఖలు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులు కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డికి సవాలుగా నిలవనున్నాయి. ఈ కేసులపై ఎలా ముందుకెళ్తారు? చార్జిషీట్ల నమోదు సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్న దానిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది.  

Advertisement
Advertisement