ప్రభుత్వ భూమిలో బోగస్ లబ్ధిదారులు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమిలో బోగస్ లబ్ధిదారులు

Published Fri, Sep 26 2014 12:02 AM

Bogus beneficiaries government lands

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అక్రమాలకు కేంద్రబిందువైన జిల్లా రెవెన్యూ శాఖలో మరో భూబాగోతం వెలుగుచూసింది. ఏకంగా నాలుగున్నర కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిలో బోగస్ లబ్ధిదారులు తిష్టవేశారు. భూపంపిణీలో భాగంగా తమకు ప్రభుత్వం భూమిని కట్టబెట్టిందంటూ.. ఏకంగా భూమి రికార్డుల్లో కీలకమైన పహాణీ ఖాతాలో చేరిపోయారు. వారివద్ద ఎలాంటి పాసుపుస్తకాలు లేనప్పటికీ అసలైన అర్హులుగా చలామణి అవుతున్నారు.

స్థానిక రెవెన్యూ శాఖలోని ఓ అధికారి అండదండలతో ఏకంగా రుణమాఫీకి సైతం అర్హత సాధించారు. చివరి నిమిషంలో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రుణమాఫీ జాబితానుంచి తొలగించినప్పటికీ.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నారు.  

 ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 189 లో 179.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని 1968 నుంచి 1993 సంవత్సరాల మధ్య కాలంలో నాగన్‌పల్లి గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ చట్టం కింద పంపిణీ చేశారు. అప్పట్లో వంద మంది వరకు లబ్ధిదారులుండగా.. ప్రస్తుతం సీను మారింది.

 తాజాగా లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 150 మందికిపైగా లబ్ధిదారులున్నట్లు రెవెన్యూ అధికారుల తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈమేరకు భూమి పహాణీ రికార్డుల్లో ఈ సంఖ్య స్పష్టమవుతోంది. 2010 సంవత్సరానికి పూర్వం రికార్డుల్లో లేని పేర్లు.. తాజా పహాణీల్లో ప్రత్యక్షమవడం గమనార్హం.

 సర్వే నంబర్లు పెంచేస్తూ..
 ప్రభుత్వ నిబంధనల ప్రకారం లావణీపట్టా రూపంలో పంపిణీ చేసిన భూమిలో లబ్ధిదారులు కేవలం సాగు మాత్రమే చేసుకోవాలి. యంత్రాంగం అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు చేసే అధికారం ఉండదు. కనీసం ఈ భూమికి సంబంధించి సర్వే నంబర్లు సైతం మార్చడం అంతసులువు కాదు. కానీ నాగన్‌పల్లిలోని ప్రభుత్వ భూమిలో భారీగా మార్పులు జరిగాయి. 2009 వరకు లేని సర్వే నంబర్లు.. ప్రస్తుత రికార్డులో చొరబడ్డాయి. పహాణీ రికార్డు ప్రకారం నాగన్‌పల్లిలోని 189 సర్వే నంబర్‌లో చివరి లబ్ధిదారుడి పేరిట 189/127గా ఉంది. 2010 సంవత్సరం అనంతరం పహాణీ రికార్డులు పరిశీలిస్తే సర్వే నంబర్లు భారీగా పెరిగాయి. పెరిగిన సర్వే నంబర్లలో ఉన్న లబ్ధిదారుల పేర్లన్నీ కొత్తవి కావడం గమనార్హం.

 సూత్రధారులు.. పాత్రధారులు..
 రెవెన్యూ రికార్డుల్లో కొత్త సర్వే నంబర్లు, లబ్ధిదారుల పేర్లు రావడంలో స్థానిక రెవెన్యూ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నాగన్‌పల్లి పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) సంస్థ ఏర్పాటుకు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో భూమి కోల్పోయిన ఒక్కో లబ్ధిదారుడికి ఎకరాకు కనిష్టంగా రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. అదేవిధంగా బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) సంస్థకు సైతం భూములు నోటిఫై చేశారు.

ఈ క్రమంలో 189 సర్వే నంబర్‌లోనూ ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు అందుకోవడంతో ఓ రెవెన్యూ అధికారి రంగంలోకి దిగారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం వస్తుందని నమ్మబలికి భారీగా వసూళ్లుచేసి కొత్తగా లబ్ధిదారుల పేర్లు సృష్టించారు. వారికి పట్టా సర్టిఫికెట్లు సైతం ఇచ్చినట్లు సమాచారం. రికార్డులో ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా పరిశీలిస్తే దాదాపు 45 ఎకరాల భూమిని కొత్తవారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఎకరా భూమి కనిష్టంగా రూ.10లక్షలు పలుకుతోంది. ఈ క్రమంలో అక్రమాలు జరిగిన భూమికి సంబంధించి దాదాపు రూ.4.5 కోట్లు ఉన్నట్లు అంచనా.

 రుణమాఫీ ప్రక్రియలోనూ గందరగోళం..
 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ప్రక్రియతో పలువురు బోగస్ లబ్ధిదారుల పేర్లు బయటకొచ్చాయి. అక్రమాలకు ఆజ్యంపోసిన అధికారి.. ఏకంగా బోగస్ లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు సైతం ఇప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించిన సమయంలో పలువురు గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తొమ్మిది మంది పేర్లు బోగస్‌గా గ్రామస్తులు తేల్చడంతో వారిని రుణమాఫీ జాబితా నుంచి తొలగించారు.

Advertisement
Advertisement