చంద్రబాబు వైఖరి మార్చుకో.. లేదంటే...: కోదండరాం | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వైఖరి మార్చుకో.. లేదంటే...: కోదండరాం

Published Sat, Mar 4 2017 5:59 PM

చంద్రబాబు వైఖరి మార్చుకో.. లేదంటే...: కోదండరాం - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఖరి మార్చుకోవాలని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హెచ్చరించారు. లేదంటే రెండు తెలుగు ప్రాంతాలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో రాజకీయ పబ్బంగడుపుకోవాలనుకోవడం సరికాదన్నారు. శనివారం ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కోదండరాం వెనుకబడిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం వల్ల సీమాంధ్ర రాజకీయనాయకుల గుత్తాధిపత్యం పోయి తెలంగాణ అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు వల్ల ఆంధ్రా ప్రాంతానికి నష్టం జరుగకపోగా, మరింత అభివృద్ది చెందడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. కేవలం పిడికెడు సీమాంధ్ర రాజకీయ నాయకుల, పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనేక దశాబ్దాలపాటు అడ్డుకున్నారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యంకాదని నమ్మి తెలంగాణకు అనుకూలం అని చెప్పిన చంద్రబాబు తెలంగాణ వస్తుందని తెలిశాక మాత్రం అనేక సాకులు చూపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. కేవలం ఆంధ్రా ప్రాంత ప్రజల మనోభావాలను రెచ్చ గొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు, సంఘటిత శక్తి, త్యాగాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చంద్రబాబు గ్రహిస్తే బాగుంటుందన్నారు.

తెలంగాణపై ద్వేషపూరిత వైఖరే అనేక అంశాలలో విభజన ప్రక్రియ నత్తనడక నడవడానికి, ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం అని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి రెండు ప్రాంతాలకూ నష్టం కలుగ జేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలంగాణలో కొనసాగుతున్నకొందరు సీమాంధ్ర రాజకీయనాయకుల, పెట్టుబడిదారుల జోక్యాన్ని తాము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement