సీఎం దత్తత గ్రామాలకు కొత్త శోభ | Sakshi
Sakshi News home page

సీఎం దత్తత గ్రామాలకు కొత్త శోభ

Published Fri, Dec 23 2016 12:39 AM

సీఎం దత్తత గ్రామాలకు కొత్త శోభ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు దత్తత గ్రామాలైన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఈ గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన 530 రెండు పడక గదుల ఇళ్లలో లబ్ధిదారులు శుక్రవారం ఉదయం గృహప్రవేశం చేయనున్నారు. సామూహికంగా జరిగే ఈ కార్యక్రమంలో.. ఆరు వందల మంది బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు రెండు పడక గదుల ఇళ్లకు పుణ్య దానం, వాస్తు పూజలు చేస్తారు. ఉదయం 7.35 గంటలకు మొదలయ్యే ఈ క్రతువు 8 గంటల వరకు జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి... లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తారు. తర్వాత లబ్ధిదారుల ఇష్ట ప్రకారం ఇంటి లగ్నాలు చేసుకుంటారు. మైవాన్‌ విధానంతో ఒకే రోజు పిల్లర్లు, స్లాబ్‌ వేసి కట్టిన ఈ గృహాలు భవిష్యత్తులో తెలంగాణ ఇళ్ల పథకానికి మార్గం చూపించనున్నాయి. కాగా సరిగ్గా ఏడాది కింద ఇదే రోజున సీఎం కేసీఆర్‌ ఘనంగా అయుత చండీయాగాన్ని ప్రారంభించడం గమనార్హం.

అంతా సిద్ధం..
ఇళ్లకు రంగులు వేయడం, విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడం, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, అంతర్గత రోడ్లు, మొక్కలు నాటే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆయా శాఖల అధికారులు గ్రామంలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రోజూ గ్రామంలో జరిగే పనుల వివరాలను తెలుసుకుంటున్నారు. రెండు గ్రామాల్లో 500 ఇళ్లకు నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. విద్యుత్‌ కనెక్షన్ల ఏర్పాటులో భాగంగా అన్ని కాలనీల్లో స్తంభాలు పాతారు. ఆరు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఇంకా ఆరు కాలనీల్లో మాత్రం సీసీ రోడ్డు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 5 వేలకు పైగా మొక్కలు నాటారు.

ఏడాదిలోగా..
సీఎం కేసీఆర్‌ గతేడాది దసరా రోజు (అక్టోబర్‌ 22)న ఈ రెండు గ్రామాల్లో ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. నవంబర్‌ 16న ఇళ్ల నిర్మాణానికి ఎర్రవల్లిలో ముగ్గులు పోశారు. కొత్తగా కట్టుకునే ఇంటికి 11 నెలల్లోపు గృహ ప్రవేశం చేయాలి. లేదంటే మూడేళ్ల దాకా ఆగాల్సి వస్తుంది. ఈ లెక్కన ముగ్గు పోసి పునాది పనులు ప్రారంభించిన నాటి నుంచి డిసెంబర్‌ 23 వరకు 11 నెలలవుతోంది. అందుకే ఆ ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. ఎర్రవల్లిలో కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో రెండు మూడంతస్తుల భవనాలు నిర్మించి.. ఇద్దరు ముగ్గురికి అందజేయనున్నారు.  


ఏ గ్రామంలో ఎన్ని ఇళ్లు
ఎర్రవల్లిలో 344, నర్సన్నపేటలో 186 మొత్తం 530 ‘డబుల్‌’ ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. వాస్తవానికి ఎర్రవల్లికి 395, నర్సన్నపేటకు 200 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఎర్రవల్లిలో 344 ఇళ్లను, నర్సన్నపేటలో 186 ఇళ్లను పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు మంజూరు చేసింది. ఇక రెండు గ్రామాల్లో మొత్తం రూ.62 కోట్లతో ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మురికి కాల్వలు, విద్యుత్‌ సౌకర్యం, ఫంక్షన్‌హాల్, గిడ్డంగులు నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement