రేషన్.. కమీషన్ | Sakshi
Sakshi News home page

రేషన్.. కమీషన్

Published Fri, Feb 5 2016 2:37 AM

Commission ration ..

ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘రెవెన్యూ’ దందా
షాపుల నుంచి నెలవారీ వసూళ్లు
మొగుళ్లపల్లి మండలంలో ఎక్కువగా..
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచన
పేదలకు సరుకులు ఎగవేస్తున్న డీలర్లు

 
వరంగల్ : పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందించే ప్రజాపంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు.. దాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. రేషన్ షాపుల నుంచి నెలవారీగా మామూళ్లు తీసుకుంటూ ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పేదలకు సరుకుల పంపిణీ విషయాన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నించి గతంలో ఒక తహశీల్దార్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు. ఈ ఘటనతోనైనా రెవెన్యూ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. తాజాగా పౌర సరఫరాల శాఖలో వచ్చిన మార్పుల నేపథ్యంలో రెవెన్యూ శాఖ వారి అక్రమాల వ్యవహారం ఇంకా పెరుగుతోంది. ఆహార భద్రత పథకంతో రేషన్ డీలర్లకు నెలవారీ  సరుకుల కోటా కొంత మేరకు పెరిగింది. ఈ అంశాన్ని సాకుగా చూపుతూ రేషన్ షాపుల నుంచి తమకు వచ్చే నెలవారీ మామూళ్ల మొత్తాన్ని పెంచాలని కొందరు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. వారే స్వయంగా ఇంత మొత్తం అని నిర్ణయించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా జరుగుతున్న ఈ దందా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఇబ్బందికరంగా మారింది.
 
మొగుళ్లపల్లిలో బరితెగింపు
మొగుళ్లపల్లి మండలంలో రేషన్ షాపుల నెలవారీ మామూళ్ల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ మండలంలో దాదాపు 32 రేషన్ షాపులు ఉన్నాయి. మిగిలిన మండలాల తరహాలోనే ఇక్కడ ఒక్కో షాప్ నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం తక్కువగా అనిపించడంతో అక్కడి అధికారులు తాజాగా ఈ నిబంధనను మార్చారు. ఒక్కో షాప్ నుంచి వెయ్యి రూపాయల చొప్పున రావాలని, దీని కోసం ప్రయత్నించాలని రెవెన్యూ సిబ్బందికి అధికారుల నుంచి అనధికార ఆదేశాలు వచ్చాయి. తాజా నిబంధన ప్రకారం మొత్తాన్ని పెంచాలని సిబ్బంది డీలర్లుకు ఈ సమాచారం ఇచ్చారు. దీనికితోడు అవసమైనప్పుడల్లా రేషన్ షాపులనే లక్ష్యంగా చేసుకుంటుండడంతో అక్కడి వారు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
 
పేదలకు డీలర్ల టోకరా...

ప్రస్తుతం రేషన్ షాపులలో బియ్యం, కిలో కందిపప్పు, కిలో గోధుమలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. చాలా చోట్ల డీలర్లు పూర్తి సరుకుల కోసం డీడీలు తీయడంలేదు. తమ దగ్గర పప్పులు, గోధుమలు ఎవరూ కొనడంలేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులతో పేదలకు సబ్సిడీ సరుకులు చేరేందుకు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, డీలర్లతో ఉన్న సంబంధాలతో ఏమీ చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ మంది పేదలకు ఈ సరుకులు అందడం లేదు. నగర ప్రాంతాల్లోని కొందరు డీలర్లు పప్పులు, గోధుమలకు డీడీలు చెల్లించి వచ్చిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం పంపిణీ విషయంలోనే అధికారులు లెక్కలు పరిశీలిస్తున్నారు. మిగిలిన సరుకుల పంపిణీ తీరును పట్టించుకోకపోవడంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటేనే రెవెన్యూ అధికారుల దందాకు ముగింపు పడుతుంది. రేషన్ డీలర్ల అక్రమ వ్యవహారాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది
 
ఒక్కో షాపునకు రూ.500
రేషన్ షాపుల నుంచి ప్రతీ నెల ఎంత ముట్టజెప్పలనేది రెవెన్యూ శాఖకు వారే నిర్ణయిస్తున్నారు. ఇది.. మండలానికో తీరుగా ఉంటోంది. సగటున మాత్రం ఒక్కో రేషన్ షాపు నుంచి ప్రతీ నెల రూ.500 వసూలు చేస్తున్నారు. ఆయా మండలాల్లోని రేషన్ డీలర్ల సంఘం నేతలు...మిగతా డీలర్ల దగ్గర వసూలు చేసి రెనెన్యూ అధికారులకు సమర్పిస్తున్నారు. మండలాల్లో ఉండే పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఉన్నతాధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారని... ఇలాంటి చోట్ల ప్రతి షాపునకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. నెలవారీ మామూళ్ల విషయంలో ఆలస్యం జరిగినా, జరగకపోయినా... అధికారులు రకరకాల నోటీసులు, దాడులతో దారికి వచ్చేలా చేస్తున్నారని చెబుతున్నారు. సాధారణం గా జరుగుతున్న వ్యవహారమే అయినా.. ఎవరూ బయటపడకపోతుండడంతో ఉన్నతాధికారులు పట్టించుకోనట్లుగానే ఉంటున్నారు.

Advertisement
Advertisement