రాజధానిలో కాంగ్రెస్ ఖాళీ | Sakshi
Sakshi News home page

రాజధానిలో కాంగ్రెస్ ఖాళీ

Published Sat, May 17 2014 1:29 AM

రాజధానిలో కాంగ్రెస్ ఖాళీ - Sakshi

  •     24 శాసనసభా స్థానాల్లో ఒక్కటీ గెలవని వైనం
  •      డిపాజిట్ కోల్పోయిన వీహెచ్
  •      పోటీ ఇవ్వని దానం, ముఖేష్
  •  సాక్షి, సిటీబ్యూరో : రాష్ట్ర రాజధాని ఓటర్లు వైవిధ్యమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానంలోనూ అవకాశం ఇవ్వకపోగా.. పలు నియోజకవర్గాల్లో మూడవ స్థానానికే పరిమితం చేశారు. అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వి.హన్మంతరావు, జయసుధలకు డిపాజిట్ గల్లంతవడం విశేషం.

    కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన దానం నాగేందర్ (ఖైరతాబాద్‌లో), మూల ముఖేష్‌గౌడ్ (గోషామహల్‌లో) భారీ తేడాతో ఓటమి పాలుకాగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌లో సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, కుత్బుల్లాపూర్‌లో శ్రీశైలంగౌడ్‌లు మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు.

    తెలుగుదేశం, బీజేపీ కూటమి గణనీయంగా పుంజుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం తొమ్మిది, బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎం పార్టీ తిరిగి తనకున్న ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది.
     
    రికార్డు మెజారిటీలు: నగరంలో బహుదూర్‌పురా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి మౌజంఖాన్ 95,023 రికార్డు మెజారిటీతో విజయం సాధించగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గాంధీ 75,904, అంబర్‌పేట నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 62,548 మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థులపై విజయం సాధించారు.
     

Advertisement
Advertisement