నిజామాబాద్ కాంగ్రెస్ లో అయోమయం | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ కాంగ్రెస్ లో అయోమయం

Published Tue, Nov 4 2014 1:30 PM

నిజామాబాద్ కాంగ్రెస్ లో అయోమయం - Sakshi

* దిగ్గజాలున్నా డీలా పడిన కాంగ్రెస్ పార్టీ
* సభ్యత్వ నమోదు ఊసేలేదు
* ప్రజా సమస్యలపైనా దృష్టి లేదు
* కాలం చెల్లిన కమిటీలపై కేడర్ ఫైర్
* సొంత వ్యవహారాలకే అగ్రనేతలు పరిమితం
* కొనసాగుతున్న గ్రూపు విభేదాలు

ప్రధాన ప్రతిపక్షం డీలా పడిపోయింది. సాధారణ ఎన్నికలలో లోక్‌సభ స్థానంతోపాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కనీసం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించలేకపోతోంది. రాష్ట్ర, జాతీయ కమిటీలలో చక్రం తిప్పగల నేతలున్నప్పటికీ సొంత వ్యవహారాలకే పరిమితమవుతున్నారని పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. జనవరిలో టీపీసీసీ అధ్యక్షుని ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఈ నెల 15 కల్లా జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి కావాలని అధిష్టానం ఆదేశించింది. కానీ, నేతలెవ్వరూ పట్టించుకున్నట్టు లేదు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు ‘ఇంట్లో ఈగల మోత... బయట పల్లకీ మోత’లా ఉంది. సొంత పనులు, పార్టీ పదవులే తప్ప ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల మనోభావాలు వారికి పట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలవాల్సిన ఆ పార్టీ నాయకత్వం కనీసం సంస్థాగత నిర్మాణంపైన దృష్టి సారిం చలేని దుస్థితిలో ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదలెట్టి ఈ నెలాఖరు నాటికి బూత్, గ్రామ, మండల, బ్లాక్ కమిటీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంకా సభ్యత్వ నమోదు కార్యక్రమమే మొదలు కాలేదు.

సాధారణ ఎన్నికలలో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఘోర పరాజయంతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల, బ్లాక్ కమిటీలపై దృష్టి సారించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించ లేదు. మరోవైపు కాలం చెల్లిన కమిటీల పెత్తనంపై కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ కమిటీలలో చక్రం తిప్పగల సత్తా ఉన్న నాయకులు జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారన్న విమర్శలు కేడర్ నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ముందుకు సాగని సభ్యత్వ నమోదు
సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జూన్ 22న జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలతో నియోజకవర్గాలవారీగా సమీక్షలు జరిపారు. ఆ తర్వాత ఆగస్టు 23, 24 తేదీలలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన మేధోమథన సదస్సుకు సైతం జి ల్లాకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. 2015 జనవరిలో రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఎన్నుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ లోగా బూత్, గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ  నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇందుకు డీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రులు కో-అర్డినేటర్‌లుగా వ్యవహరించాలని సూచించింది.

సెప్టెంబర్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, నవంబర్ 15 వరకు పూర్తి చేయాలని పేర్కొంంది. అదే నెలాఖరులోగా బూత్, గ్రామ స్థా యి కమిటీలను ఎన్నుకోవాలని సూచించింది. డిసెంబర్ మొదటి వారం వరకు బూత్ కమిటీల నుంచి జిల్లా కమిటీ అధ్యక్షుల వరకు అన్ని స్థాయిల్లో సంస్థాగత కమి టీ ల ఎన్నికలు పూర్తి చేసుకొని 2015 జనవరిలో రాష్ట్ర నేతను ఎన్నుకునేందుకు సిద్ధం కావాలనేది అధిష్టానం నిర్ణయం. అయితే, జిల్లాలో పార్టీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సభ్యత్వ నమోదు అసలే మొదలు కాకపోగా, కాలం చెల్లిన కమిటీలనే నడుపుతున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

అసలేం జరుగుతోంది
శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీ, సురేష్‌షెట్కార్, మాజీ విప్ అనిల్‌కుమార్, బొమ్మ మహేశ్‌కుమార్, ఆకుల లలిత తదితరులు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డా క్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ర్టంలో ఇతర ప్రాంతాల తో పోలిస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్న వ్యాఖ్యలు ఆ పార్టీకి చెందిన నేతల నుంచే వినిపిస్తున్నాయి. కొందరు నాయకులు సొంత పనులు, పదవులే లక్ష్యంగా పని చేస్తుండటంతో పార్టీ రోజు రోజుకు ప్రజలకు దూరమవుతోంది.

అధికారాన్ని ఉపయోగించుకుని పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తున్న ఆ నేతల తీరే పార్టీ ప్రతిష్టకు భంగం కలిస్తుందన్న విమర్శలు కూడ ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్పుడు ఒకరు ‘ అగ్నిబాణం’ వేస్తే... ఇంకొకరు ‘నీళ్ల బాణం’ వేసినట్లుగా వ్యవహరించారన్న పేరున్న సీనియర్ల మధ్యన గ్రూపు రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉ న్నాయి. ప్రధానంగా శాసనమండలి విపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి గ్రూపుల మధ్యన సాగుతున్న అంతర్గత పోరుపై హై కమాండ్ దృష్టి సారించినా ఫలితం లేకపోయింది. పలువురు సీనియర్లు ప్రాబల్యం కోసం పాకులాడుతుండగా, తమ పరిస్థితి దిక్కుతోచకుండా ఉందని కార్యకర్తలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement