వీడని గ్రహణం! | Sakshi
Sakshi News home page

వీడని గ్రహణం!

Published Sun, Aug 2 2015 11:16 PM

వీడని గ్రహణం! - Sakshi

‘కాగ్నా’పై వంతెన నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం
నాలుగేళ్ల క్రితం అసంపూర్తి దశలో నిలిచిపోయిన పనులు
రూ.10 కోట్లు మంజూరు చేసిన ప్రస్తుత సర్కారు
దిక్కూదివాణం లేని టెండర్ల ప్రక్రియ    ఇరవై గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు

 
తాండూరు: కర్ణాటక సరిహద్దు బషీరాబాద్ మండలం జీవన్గీ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. సరిహద్దులో అంతర్రాష్ట్ర రహదారితో లింకు ఏర్పడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి గ్రహణం వీడటం లేదు. ఏలికల చిన్నచూపుతో ఇరవై గ్రామా ల ప్రజల రాకపోకల కష్టాలు తీరని పరిస్థితి నెలకొంది. గతంలో అరకొర పనులు చేసిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందమే అయ్యాయి. జీవన్గీ గ్రా మంలో కాగ్నా నదిపై ఈ వంతెన నిర్మించాల్సి ఉంది. సరిహద్దులోని కర్ణాటకతో పాటు తాండూరుకు రాకపోకలు సుగమమవుతాయి. అప్పటి మంత్రి ఇంద్రారెడ్డి హ యాంలో ఇక్కడ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కానీ పునాదుల దశలోనే పనులు  ఆగిపోయాయి. నాలుగేళ్ల క్రితం పనులు చేపట్టినా అసంపూర్తిగా వదిలేశారు. తాజాగా తెలంగాణ సర్కారుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. కానీ టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఫలితంగా బ్రిడ్జి పనులకు మోక్షం కలగటం లేదు.

 12 కి.మీ. దూరం తగ్గుతుంది..
 బషీరాబాద్ నుంచి తాండూరుకు 30 కి.మీ.దూరం. జీవన్గీ వద్ద వంతెన నిర్మాణంతో కరన్‌కోట మీదుగా తాండూరుకు 18 కి.మీ. దూరం.దీంతో 12 కి.మీ. దూరం తగ్గుతుంది. బషీరాబాద్ నుంచి జీవన్గీతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరన్‌కోట్ మీదుగా కర్ణాటక పరిధిలోని చించొళి, గుల్బర్గా, సులేపేట్, ఉమ్మాబాద్  ప్రాంతాల రాకపోకలకు సులవుతుంది. లేనిపక్షంలో తాండూరుకు చేరుకొని ఆయా గ్రామాలకు వెళ్లడం దూరం పెరగటంతోపాటు సమయాభావం పడుతుంది. తాండూరు మండలంలో నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తుల లారీలు పెద్ద సంఖ్యలో కర్ణాటకు వెళ్తుంటాయి.  

 ప్రస్తుతం వాహనాల రాకపోకలు ఇలా..
 తాండూరు మండలంలోని నాలుగు సిమెంట్ కర్మాగారాల నుంచి సిమెంట్ లోడ్ లారీలు గౌతాపూర్, తాండూరు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు చేరుకొని అక్కడి నుంచి కర్ణాటకు వెళుతుంటాయి. లారీలు తాండూరులోకి ప్రవేశించడం వల్ల ట్రాఫిక్ చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి.

 రూ.60లక్షలు వృథా!
 సుమారు నాలుగేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. పిల్లర్ల వరకు పనులు చేపట్టారు. దాదాపు రూ.60 లక్షల పనులు జరిగాయి. ఆ తర్వాత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. తెలంగాణ సర్కారు ఏర్పడిన అనంతరం అధికారులు కొత్త అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించారు.
 
సాంకేతిక అనుమతులు వస్తేనే..
జీవన్గీలో వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరయ్యాయి. కాగ్నా నదిలో 250 మీటర్ల పొడవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.6కోట్లు,  బషీరాబాద్  వైపు 2 కి.మీ.,కరన్‌కోట్ వైపు 2.5కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. సాంకేతిక అనుమతి ఉత్వర్వులు వస్తే టెండర్లు నిర్వహించి పనులు మొదలుపెడతాం.     - జానకిరాములు, ఆర్‌అండ్‌బీ, డీఈఈ
 
 

Advertisement
Advertisement