దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడండి | Sakshi
Sakshi News home page

దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడండి

Published Mon, May 30 2016 2:37 AM

దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడండి - Sakshi

ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే
తీరు మారకపోతే పునాదులు కదిలిస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం.

 
కరీంనగర్ : ఆచరణకు సాధ్యంగాని వాగ్దానాలు చేసి తీరా అధికారంలోకొచ్చాక ప్రజలను వంచిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోందని, ఆ పాలనకు చరమగీతం పాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం సర్కస్‌గ్రౌండ్‌లో ఎంఎస్‌ఆర్‌ఏసీ జిల్లా అధ్యక్షుడు వసీం అహ్మద్ అధ్యక్షతన జరిగిన ముస్లింగర్జన బహిరంగ సభలో మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ అమలుచేస్తానని, సబ్‌ప్లాన్ చట్టం చేసి తీరుతామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకొచ్చి 24 నెలలు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించా రు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం పేరిట ఓట్లు దండుకుని.. ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే పునాదులను కదిలిస్తామని హెచ్చరించారు.

మాట తప్పితే మెడ నరుక్కుంటా.. అంటున్నా కేసీఆర్ ఇప్పటికే 114 వాగ్దానాలు ఇచ్చి తప్పారని, ఎన్నిసార్లు మెడ నరక్కుంటాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బంగారు తెలంగాణ అవసరం లేదని, బువ్వ పెట్టే తెలంగాణ కావాలన్నారు. మైనార్టీ రిజర్వేషన్లు నాలుగు నెలల్లో అమలు చేస్తానని నమ్మబలికి 24 నెలలైనా అతీగతి లేదన్నారు. రంజాన్ పండుగకు బిర్యానీ, కొత్త దుస్తులు ఇస్తే సరిపోదని రిజర్వేషన్‌తోపాటు నిధుల్లో తగిన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలను దేశద్రోహులుగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, గోమాంసం తింటే చంపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
 
 
వాగ్దానాలు అమలు చేయాల్సిందే

సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నమ్మించి నట్టేట ముంచడంలో కేసీఆర్‌కు సాటి ఎవరూ లేరన్నారు. 12 మంది ఎంపీలు, అసెంబ్లీలో పూర్తిస్థాయి బలమున్నా ఒక్కరోజు కూడా ముస్లింల రిజర్వేషన్‌గానీ, సబ్‌ప్లాన్ చట్టం అంశం కానీ ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రంగనాథన్ మిశ్రా, సచార్ కమిటీ నివేదికలను ఆధారంగా చేసుకుని ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
 .
 
 
కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
 ఫ్రోఫెసర్ కోదండరాం
 
ముస్లిం రిజర్వేషన్ల అంశంతోపాటు సబ్‌ప్లాన్ చట్టం నిధుల కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఇచ్చిన హామీలను అమలుపరిచేలా కృషి చేయాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ముస్లిం మైనార్టీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్నారు. జేఏసీ అధ్వర్యంలో ముస్లిం మైనార్టీల న్యాయమైన డిమాండ్ల సాధనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బహిరంగ సభలో ఎంఎస్‌ఆర్‌ఏసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.డీ అబ్బాస్, ఉపాధ్యక్షుడు డీజీ నర్సింహ, జియావుద్దీన్, జుబేర్, ఇబ్రహీం, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, నాయకులు గుడికందుల సత్యం, ఎండీ.అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement