Sakshi News home page

దత్తం చేసినా దయలేదు

Published Sat, May 9 2015 12:25 AM

దత్తం చేసినా దయలేదు - Sakshi

తండ్రికి తలకొరివి పెట్టని దత్తపుత్రుడు  
నాలుగు రోజులైనా ఇంట్లోనే మృతదేహం
 

వికారాబాద్ రూరల్: పెంచి పోషించి.. ఆస్తి మొత్తం ధారాదత్తం చేసిన తండ్రికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదో దత్తపుత్రుడు. నాలుగు రోజుల పాటు ఇంట్లోనే దిక్కుమొక్కు లేని శవంలా పడి ఉండగా.. రెండో భార్య విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని ఆలంపల్లికి చెందిన అశోక్(75)కు ముగ్గురు భార్యలు. మొదటి, మూడో భార్యలు ఆయనను విడిచిపెట్టి వెళ్లారు. రెండో భార్య మల్లేశ్వరి, ఆమె కూతురు కల్యాణి.. అశోక్‌కు దూరంగా గ్రామంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా అశోక్ కొన్నేళ్ల క్రితం తన ఆలనాపాలన చూసుకునేందుకు అదే గ్రామానికి చెందిన శ్రీధర్‌ను దత్తత తీసుకున్నాడు. శ్రీధర్ కొన్నేళ్లు ఆర్మీలో పనిచేసి ఇటీవల రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పోషణ మొత్తం తానే చూసుకుంటానని నమ్మబలికిన అతడు తండ్రి అశోక్ పేరుమీద ఉన్న ఆరెకరాల పొలాన్ని తన పేర రాయించుకున్నాడు.

కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అశోక్.. ఈ నెల 4న మృతిచెందాడు. అయితే శ్రీధర్.. తండ్రి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంట్లోని తప్పించుకొని తిరుగుతున్నాడు. నాలుగు రోజులు కావడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లింది. విషయం తెలుసుకున్న మృతుడి భార్య మల్లేశ్వరి స్థానికుల నుంచి విరాళాలు సేకరించి భర్త అంత్యక్రియలు నిర్వహించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement