వైకల్యాన్ని జయించిన ప్రతిభ | Sakshi
Sakshi News home page

వైకల్యాన్ని జయించిన ప్రతిభ

Published Tue, Aug 11 2015 11:49 PM

వైకల్యాన్ని జయించిన ప్రతిభ - Sakshi

ఆయన పుట్టుకతోనే మూగ, చెవిటి వ్యక్తి. మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్ననాటి నుంచి బొమ్మలు వేయడమంటే ప్రాణం. ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీనికి తోడు సమయం దొరికినప్పుడల్లా తాను అభిమానించే వారి చిత్రాలు గీస్తుంటాడు. తాను గీసిన చిత్రాలకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆయనే పోడుపాటి వెంకటేశ్.
- వెంకటేష్ పుట్టుకతోనే మూగ, చెవిటి
- అయినా అద్భుత ప్రతిభ
- ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణ
సిద్దిపేట రూరల్ :
పోడుపాటి వెంకటేశ్ స్వస్థలం కొండపాక మండల కేంద్రం. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి సిద్దిపేట పట్టణంలోని భారత్‌నగర్‌లో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య రేవతి, ఇద్దరు పిల్లలున్నారు. చిన్ననాటి నుంచే మూగ, చెవుడు. ఎంతో కష్టపడి ఐటీఐ, డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం ఇర్కోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా  పని చేస్తున్నాడు. వీటికి తోడు చిన్ననాటి నుంచి చిత్రకళపై ఆయన పెంచుకున్న అభిమానం అనేక మంది అభిమానాన్ని పొందేలా చేసింది. తనకు నచ్చిన వ్యక్తుల ఫొటోలను తీసుకుంటూ.. వాటి ఆధారంగా బొమ్మలను గీస్తూ వారికే గిప్టుగా అందిస్తుంటాడు. వెంకటేశ్ ఎక్కువగా ఆర్టీసీ చిత్రాలను గీస్తూ అదే బస్సులో ఫొటోలను అతికిస్తాడు.
 
ప్రముఖుల చిత్రాలు...

వెంకటేశ్ చిన్ననాటి నుంచి ఎక్కువగా ఆర్టీసీ బస్సుల చిత్రాలను గీసేవాడు. ప్రస్తుతం వాటితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, దేవుళ్ల చిత్రాలను చూసి పెన్సిల్‌తో గీసి స్కెచ్‌తో కలర్లు వేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. గతంలో మంత్రి   హరీష్‌రావుతో పలుమార్లు అభినందనలు అందకున్నాడు.
 
ప్రభుత్వం ఆదుకోవాలి : వెంకటేష్
తనకు చిన్ననాటి నుంచి చిత్రాలు వేయడం అలవాటని, ప్రభుత్వం గుర్తించి తనను ఆదుకుంటే చిత్రలేఖనంలో మరింత రాణిస్తా (సైగలతో) నంటూ వెంకటేశ్ పేర్కొన్నాడు. తనకు ఏదైనా ఇష్టం అనిపిస్తే చాలు దాన్ని బొమ్మ రూపంలో వ్యక్తపరుస్తానని పేపరు మీద రాసి చూపించాడు. ఇప్పటి వరకు చాలా మంది ప్రశంసలు పొందినట్లు కుటుంబికులు తెలిపారు.

Advertisement
Advertisement