సీన్ మారింది | Sakshi
Sakshi News home page

సీన్ మారింది

Published Mon, May 19 2014 1:53 AM

district politics changed with general elections

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల ఫలితంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీలు, నేతలు ఓటమి పాలు కావడంతో కొత్త వారికి అధికార పగ్గాలు అందాయి. అయితే, జిల్లా ప్రజానీకం ఈ ఎన్నికలలో విలక్షణ తీర్పునిచ్చింది. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్‌లకు విజయం చేకూర్చిన ఓటర్లు.. సీపీఐ, న్యూడెమోక్రసీలను మాత్రం ఆదరించలేదు.

 దాదాపు అన్ని పార్టీలకు ఒకటో, రెండో స్థానాలు దక్కగా, ప్రతి పార్టీకి ఏదో ఒక పదవి లభించింది. ఖమ్మం ఎంపీగా వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయం సాధించగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అవకాశమిచ్చారు ప్రజలు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాన్ని మాత్రం టీడీపీలో చేతిలో పెట్టారు. ఈ పదవుల సంగతలా ఉంటే తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోనికి రావడంతో ఆ పార్టీకి కూడా ప్రజలు పట్టం కట్టినట్టయింది.

అయితే, ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ మాత్రం జిల్లాలో మాత్రం పూర్తిగా చతికిలబడిపోగా, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలు కూడా అదే పరిస్థితిలోకి వెళ్లాయి. నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో జిల్లాలో ఆ పార్టీ తరఫున గెలుపొందిన వారు, కేడర్ అయోమయానికి గురవుతున్నారు. ఇక, పోటీచేసిన తొలి సార్వత్రిక ఎన్నికలలోనే ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రం విజయాన్ని ఆస్వాదిస్తూ నూతనోత్సాహంతో ఉన్నాయి.

 శీనన్న నాయకత్వంలో జిల్లా అభివృద్ధి...
 ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనున్నారు. తెలంగాణలో ఆ పార్టీ తరఫున ఒకే ఎంపీకి ప్రాతినిధ్యం రావడంతో ఆయన ముఖ్య భూమికే పోషిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు జిల్లాలో ఆయనకు మద్దతుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ తరఫున గెలుపొందారు. వీరి సహకారంతో పాటు ఇతర పార్టీల సూచనలతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఈ ఐదేళ్ల పాటు శీనన్న పెద్దన్న పాత్ర పోషించబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఆ పార్టీ కేడర్ కూడా సంస్థాగతంగా బలపడేందుకు ఈ ఫలితాలు సహకరిస్తాయని అంటున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేడర్ ఉన్న వైఎస్సార్‌సీపీ భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.

 మంత్రి పదవి వస్తుందా..?
 మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ వైపు జిల్లా ప్రజలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. జిల్లా నుంచి ఒకే ఎమ్మెల్యే గెలవడంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి పదవి లభిస్తే జలగం వెంకట్రావు కూడా జిల్లాలో కీలకం కానున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలలో పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు తమకు కేసీఆర్ ఎలాంటి అవకాశం ఇస్తారోనని ఆశగా చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇస్తారని,  ఒకరిద్దరికి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ పరంగా చూస్తే బలహీనంగా ఉన్న టీఆర్‌ఎస్ జిల్లాలో పట్టు నిలుపుకోవాలంటే ఖమ్మం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధతో కేసీఆర్ పనిచేయాల్సి ఉంటుందని కేడర్ అభిప్రాయపడుతోంది.

 గెలిచాం... కానీ..
 ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినందుకు సంతోషించాలో, తెలంగాణ ఇచ్చినా అధికారం దక్కనందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ తరఫున గెలిచిన వారితో పాటు ఇతర నాయకులు కూడా గందరగోళంలో ఉన్నారు. ప్రస్తుతం వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకులు కూడా తమ పదవీకాలం ఎప్పటికి పూర్తవుతుందో అని లెక్కలు క ట్టుకుంటున్నారు. పార్టీలోని వర్గ విభేదాలకు తోడు అధికారం కూడా చేజారడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆలోచనలో ఆ పార్టీ నాయకులున్నారు.

 తెలుగు తమ్ముళ్ల నిర్వేదం...
 ఇక, జిల్లాలో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ ఎన్నికల తర్వాత పూర్తిగా చతికిలబడిపోయింది. జిల్లాలో కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఓడిపోవడం, జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు పూర్తి నిర్వేదంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, జిల్లాలో పార్టీ పూర్తిగా ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందులో భాగంగానే పార్టీ నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుంటూ కొట్టుకునేంతవరకు వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఐదేళ్లు తమ పరిస్థితేంటనేది ఆ పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు.

Advertisement
Advertisement