‘డబుల్’ కష్టాలు | Sakshi
Sakshi News home page

‘డబుల్’ కష్టాలు

Published Sat, Feb 27 2016 3:22 AM

‘డబుల్’ కష్టాలు - Sakshi

డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం పేదల నుంచి పోటెత్తుతున్న దరఖాస్తులు
వాటిని పరిష్కరించలేక తలలు పట్టుకున్న అధికారులు
ఇప్పటిదాకా జరగని కమిటీ సమావేశాలు
అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు చేసేసిన ఎమ్మెల్యేలు

 సాక్షి, నెట్‌వర్క్: సొంతిల్లు ఓ కల.. ఆ కలను సాకారం చేస్తామని, గతంలో మాదిరిగా కాకుండా డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనలతో నిరుపేదల ప్రజల్లో ఆశలు ఒక్కసారిగా రేగాయి. రెండు పడక గదుల ఇళ్ల కోసం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఇప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు!

 ఏమీ లేకముందే శంకుస్థాపనలు
సాధారణంగా ఏ పథకమైనా.. అన్ని సిద్ధం చేశాక శంకుస్థాపనలు చేయడం ఆనవాయితీ. కానీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. లబ్ధిదారులు లేరు. స్థలాలు, నిధులు లేవు. కానీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరిగిపోయాయి. దసరా రోజు సీఎం చంద్రశేఖర్‌రావు స్వయంగా సూర్యాపేటలో శంకుస్థాపన చేయగా.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు శంకుస్థాపనలు చేశారు. లబ్ధిదారుల్ని ఎలా ఎంపిక చేయాలి? దరఖాస్తులు ఎలా తీసుకోవాలి? ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఎక్కడున్నాయన్న అంశాలను పరిగణలోకి తీసుకోకముందే.. శంకుస్థాపనలు చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభం అవుతుందన్న ఆశ తో ప్రజలు సర్కారీ  కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం స్వయంగా కొన్ని పట్టణాలకు అదనపు ఇళ్లు నిర్మిస్తామని కూడా ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రచారం కూడా జనంపై విపరీతమైన ప్రభావం చూపించింది. మురికివాడల్లో నివసించేవారు సొంతగూడుపై ఆశతో కలెక్టర్ కార్యాలయాలకు పోటెత్తారు. చివరికి విపరీతమైన రద్దీ ఏర్పడడంతో ఎవరూ కలెక్టరేట్‌కు రావొద్దని, మీ-సేవ కేంద్రాల ద్వారా పంపించాలని అధికారులు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

 కమిటీ సమావేశాలేవీ..?
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి, లబ్ధిదారుల ఎంపికకు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అందులో అధికారులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటిదాకా ఈ కమిటీల సమావేశాలు జరగలేదు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాలు, ఆయన సొంత నియోజకవర్గంలో తప్ప ఇతరచోట ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానేలేదు. కరీంనగర్ జిల్లా ముల్కనూర్‌లో దాదాపు 200 ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించడంతో.. అక్కడి ప్రజలు ఉన్న ఇళ్లను కూల్చేసుకుని, రేకుల షెడ్లలో నివాసం ఉంటున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే.. రాష్ట్ర రాజధాని నగరంలో మాత్రం ఏకంగా 4.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో అధికారులు దరఖాస్తులు తీసుకోనేలేదని సమాచారం. ఎన్నికలు జరగాల్సి ఉన్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రం 582 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది.

 పైరవీలతో అన్యాయం చేశారు
బ్యాండ్ వాయించుకుని బతికే నిరుపేదను. నా భార్య పేరిట డబుల్‌బెడ్ రూం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. అధికారులు సర్వే చేసి అర్హుల జాబితాలో చేర్చారు. గ్రామానికి 15 ఇళ్లు మంజూరైతే అందులో ఎస్సీలకు 10, బీసీలకు 4, ఒకటి మైనార్టీకి కేటాయించారు. అర్హత జాబితాలో లేని మరో నలుగురికి ఇళ్లు మంజూరు చేశారు. నా భార్య పేరును తొలగించారు. రాజకీయ నాయకుల పైరవీ లతో మాకు అన్యాయం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన. - వడ్కాపురం రాజయ్య, కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం పడకల్

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియడం లేదు
ప్రభుత్వం ఇస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియడం లేదు. గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ స్థలం లేకపోవడంతో నిర్మించుకోలేదు.  ఇప్పడైనా ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలి. మాలాంటి వాళ్లకు గూడు కల్పించాలి.  - బిరుదు లచ్చమ్మ, గౌరారం, తెలకపల్లి, మహబూబ్‌నగర్

గుడిసెలోనే ఉంటున్నాం

ఇప్పటి వరకు నాకు ఇల్లు మంజూరు కాలేదు. గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ జాగా లేక ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడైనా కేసీఆర్ ఇల్లు కట్టిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నా.  - ఎరుకల నర్సమ్మ,  వెల్దుర్తి, మెదక్

 

Advertisement
Advertisement