యువత కోసం.. క్రికెట్‌ గాలం.. | Sakshi
Sakshi News home page

యువత కోసం.. క్రికెట్‌ గాలం..

Published Thu, Nov 29 2018 11:22 AM

Election Candidates Attracting The Voters With Cricket In Warangal   - Sakshi

     యువతా.. మీ చల్లని చూపు మాపై ఉంటే చాలు.. ఆ తరువాత వస్తే నిరుద్యోగభృతి.. ఉద్యోగాల కల్పన.. ఉపాధి మార్గాలను చూపుతాం అంటూ రాజకీయ నాయకులు హామీలను గుప్పిస్తున్నారు. యువ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలో 25 శాతం యువ ఓటర్లే ఉండడంతో అన్ని పార్టీలు యువతనే టార్గెట్‌ చేస్తున్నాయి. మానుకోట, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో యువ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములలో కీలకం కానున్నారని అంచనా వేస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు.

సాక్షి, మహబూబాబాద్‌: శాసనసభకు జరగనున్న ముందస్తు ఎన్నికల్లో యువత ఓట్లు కీలకంగా మారాయి. జిల్లాలో గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్న యువత ఓటు హక్కును వినియోగించుకోనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు వీరిని ప్రసన్నం చేసుకోవటంపై దృష్టిసారించాయి. యువతను ప్రసన్నం చేసుకోవడానికి గాను పలు రాజకీయ పార్టీలు తాయిలాలను కూడా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌ కిట్లు ఇప్పించడం, టోర్నమెంట్లు పేరుతో నిర్వహించి నగదు బహుమతులు ప్రకటించటం, యువజన సంఘాలను అన్ని విధాలా ప్రోత్సహిస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అదే విధంగా తమ పార్టీలు అధికారంలోకి వస్తే యువకుల కోసం చేపట్టే కార్యక్రమాలను అంతర్గత సమావేశాల్లో ఆయా పార్టీలు ఏకరువు పెడుతున్నాయి. అంతేకాకుండా యువజన సంఘాలకు సైతం ఇంత మొత్తం ఇస్తామంటూ రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. యువజన సంఘాలకు కూడా డబ్బులు ఎరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తానికి యవత ఓట్లకు గాలం వేయడానికి రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి.

 కొత్త ఓటర్లు
జిల్లాలోని 403329 మొత్తం ఓటర్లలో సుమారు 25 శాతం వరకు యువ ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితాలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు ఆర్థమవుతుంది. మానుకోట నియోజకవర్గంలో కొత్త ఓటర్లు 12,557 మంది నమోదు చేసుకున్నారు. అలాగే డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలో 10,394 మందితో కలిపి మొత్తం 22,951కొత్త ఓట్లు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ మొత్తం తొలిసారిగా ఓటు హక్కును నమోదు చేసుకున్నావారే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా ఓటు హక్కును పొందినవారు తమ తొలి ఓటు ఎవరికి వేస్తారోననే సంశయం అన్ని పార్టీల్లోనూ నెలకొంది. ఓటరు ముసాయిదా ప్రకారం 18–19సంవత్సరాల లోపు వారు 11,347 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 20–29 సంవత్సరం లోపు 1,00,176 మంది ఓటర్లు కలరు. ఇది దాదాపు మొత్తం ఓట్లలో సుమారు 25శాతంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ సారి వీరు ఎటువైపు మొగ్గుచూపుతారో అని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పెరిగిన ఓట్లు తమను ముంచుతాయో తేల్చుతాయో అని పార్టీలు భయపడుతున్నాయి.

యువతకు నిరుద్యోగ భృతితో గాలం
కొత్త ఓటర్లను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు యువత ప్రాధాన్యత అంశాలను పార్టీలు మేనిఫెస్టోలో పార్టీలు చేర్చుతున్నాయి. అయితే పార్టీలు ప్రకటిస్తున్న మేనిఫెస్టోలు యువ ఓటర్లను ఏమాత్రం ఆకర్షిస్తాయో వేచి చూడాలి. ప్రధాన పార్టీలు అన్నీ నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెబుతున్నాయి. ఆలాగే అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్నాయి. ఇదిలా ఉంటే యువకులు మాత్రం నిరుద్యోగభృతి కన్నా ఉపాధి కల్పనే  మేలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని, స్వయం ఉపాధి మార్గాలు చూపాలని, యువతకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

   

Advertisement
Advertisement