Sakshi News home page

వెళ్లొస్తం రాజన్నా..

Published Wed, Mar 9 2016 1:58 AM

వెళ్లొస్తం రాజన్నా.. - Sakshi

ఎములాడ రాజన్న సన్నిధిలో వైభవంగా జరిగిన మహాశివరాత్రి జాతర ముగిసింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 6 నుంచి 8 వరకు జాతరోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 4లక్షల మంది తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి రూ.87 లక్షల ఆదాయం సమకూరింది. సూర్యగ్రహణంతో మంగళవారం సాయంత్రం ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తులు వచ్చే ఏడాదికి మళ్లొస్తం రాజన్నా అంటూ సెలవు తీసుకున్నారు.   
-వేములవాడ

 
 
* ముగిసిన మహాశివరాత్రి వేడుకలు
* జాతర సక్సెస్‌తో రాజన్నకు పూజలు
* రూ.87 లక్షల ఆదాయం
* కొనసాగతున్న భక్తుల సందడి

 
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఏటా అత్యంత వైభవంగా జరుపుకునే మహాశివరాత్రి వేడుకలు మంగళవారం ముగిశాయి. మూడు రోజుల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో పురవీధులన్నీ సందడిగా మారారుు. భక్తుల ద్వారా మూడు రోజుల్లో స్వామి వారికి రూ.87 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు ఆలయ అకౌంట్స్ ఏఈవో ఉమారాణి తెలిపారు. హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉంది. జాతర భక్తుల సౌకర్యాల కోసం రూ.1.10 కోట్లు ఖర్చు చేయగా రూ.87 లక్షలు మాత్రమే రావడంతో ఖర్చు ఎక్కువై... ఆదాయం తక్కువైందని ఆలయ అధికారులు అసంతృప్తిలో ఉన్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభమైన జాతరకు నాలుగు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
 
ఆర్టీసీకి అంతంత మాత్రమే...
మహాశివరాత్రి జాతర ఉత్సవాలతో ఎంతో ఆదాయం వస్తుందని ఆశతో ఎదురుచూసిన ఆర్టీసీ అధికారులకు నిరాశే మిగిలింది. ప్రతినిత్యం వచ్చే ఆదాయంతో సమానంగానే ఆదాయం వచ్చింది తప్ప జాతర ఉత్సవాల ప్రత్యేకం ఏంకనిపించలేదని డీఎం శ్రీనాథ్ తెలిపారు. ఒకే వైపునుంచి భక్తుల రద్దీ వచ్చింది తప్ప.. మరో ప్రాంతం వాళ్లు తక్కువగా వచ్చారని, సమ్మక్క భక్తుల ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపించిందని చెప్పారు. వ్యాపారం కూడా అంతంత మాత్రమే కొనసాగిందని వ్యాపారులూ అసంతృప్తిగా ఉన్నారు.
 
బందోబస్తు నుంచి పోలీసులు రిటర్న్
జాతర బందోబస్తులో పాల్గొనేందుకు వేములవాడకు వచ్చిన పోలీసులు మంగళవారం ఉదయం నుంచే వెనుదిరిగారు. జాతర బందోబస్తు కోసం శనివారమే వేములవాడకు చేరుకున్న 1074 మంది పోలీసులు ఆది, సోమవారాలు షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహించారు. భక్తుల రద్దీ కాస్త తగ్గడంతో సిరిసిల్ల డివిజన్ పోలీసులు మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాలకు చెందిన పోలీసులు తిప్పి పంపించినట్లు అధికారులు వెల్లడించారు.
 
అధికారుల్లో సంతోషం
జాతర సక్సెస్ కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో సంతోషం నెలకొంది. ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఇతర అధికారులు, అర్చకులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర వర్గాల వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కు చెల్లించుకున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement