’గుట్ట’ కు జై | Sakshi
Sakshi News home page

’గుట్ట’ కు జై

Published Thu, Feb 26 2015 12:46 AM

’గుట్ట’ కు జై - Sakshi

సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్
 యాదగిరీశుడ్ని దర్శించుకున్న కేసీఆర్
 అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
 పలు నిర్మాణాల్లో మార్పుచేర్పులకు సూచన
 రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ, ఇతర ఏర్పాట్లకు ఆదేశాలు
 సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా గుట్టను తీర్చిదిద్దడానికి ఏటా 100కోట్ల రూపాయలు కేటాయిస్తాం

 
 
భక్తులకు పరిపూర్ణ ఆధ్యాత్మిక భావన కలిగేలా సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దడానికి ఏటా 100 కోట్ల రూపాయలను కేటాయిస్తాం. గుట్టను అద్భుతరీతిలో అభివృద్ధి పరచడానికి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేయాలి. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ప్రధాన ఆలయానికి ఎలాంటి మార్పులేకుండా నూతన నిర్మాణాలు జరగాలి. కొండపైన పలు నిర్మాణాల్లో మార్పులు చేర్పులు కూడా చేయాలి. ఇందుకోసం చినజీయర్‌స్వామిని త్వరలో యాదగిరిగుట్టకు ఆహ్వానించి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాం..
 - ముఖ్యమంత్రి కేసీఆర్
 
 
 భువనగిరి: యాదగిరిగుట్ట పవిత్రత దెబ్బతినకుండా ఆగమశాస్త్ర నియమాలు, సంప్రదాయాలను పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్థపతి సుందర్‌రాజన్, యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ అధికారి కిషన్‌రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఆర్కిటెక్ట్‌లు రాజ్, జగన్‌తో కలిసి కొండపైన పలు ప్రాంతాలను సందర్శించారు. అలాగే హెలికాప్టర్‌లో యాదగిరిగుట్ట పరిసరాలను 2 రౌండ్లు ఏరియల్ సర్వే చేశారు.
 
 తర్వాత ఆండాళ్ నిలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. భక్తులకు పరిపూర్ణ ఆధ్యాత్మిక భావన కలిగేలా సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దడానికి ఏటా 100 కోట్ల రూపాయలను కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. గుట్టను అద్భుతరీతిలో అభివృద్ధి పరచడానికి అధికారులు అప్రమత్తంగా పనిచేయాలన్నారు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం ప్రధాన ఆల యానికి ఎలాంటి మార్పులేకుండా నూతన నిర్మాణాలు జరగాలని సూచించారు. కొండపైన పలు నిర్మాణాల్లో మార్పులు చేర్పులు కూడా చేయాలన్నారు. ఇందుకోసం చినజీయర్‌స్వామిని త్వరలో యాదగిరిగుట్టకు ఆహ్వానిం చి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.
 
 పది రోజుల్లో అభివృద్ధి ప్రణాళిక
 గుట్ట అభివృద్ధి కార్యక్రమాలపై పది రోజుల్లో సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కొండపైన 14.5 ఎకరాల స్థలం ఉందని, ఇందులో ప్రతి అంగుళం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రధానాలయం చుట్టూ మాడ వీధులు, కల్యాణ మంటపాలు, యాగశాల, ప్రవచన శాల, వ్రతశాల, వంటశాల నిర్మించాలని చెప్పారు. గుట్ట నలుదిక్కుల్లో ఎటువైపు నుంచి చూసినా ఆలయం, గోపురం స్పష్టంగా కనిపించాలని సూచించారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న కొన్ని నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. సుమారు 500 గదులు వచ్చే విధంగా కాటేజీలు నిర్మించాలని, కొండపైన వ్రతాలు, పెళ్లిళ్లను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.
 
 నిర్మాణాలు జరిగే సమయంలో వ్రతాలు, పూజలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగులేన్ల రోడ్డును వెంటనే విస్తరించాలని, అలాగే  గుట్టకు నాలుగువైపుల ఉన్న వంగపల్లి, రాజాపేట, తుర్కపల్లి, రాయగిరి రోడ్లను వెడల్పు చేసి అభివృద్ధిపరచాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఆకర్షణీయమైన పూలచెట్లు, గుట్ట చుట్టూ సుగంధాలు వెదజల్లే చెట్లను పెంచాలని అటవీ శాఖ ఆధికారులకు నిర్దేశించారు.  యాదగిరిగుట్టకు వచ్చే మార్గంలో నాలుగు దిక్కుల నుంచి వేదమంత్రాలు, స్త్రోత్రాలు, భక్తిగీతాలు, ఆలయ ప్రకటనలు వినిపించే విధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.
 
 రోడ్డుకు ఇరువైపులా భక్తి భావం కలిగించే, నైతిక విలువలు పెంపొందించే, పర్యావరణాన్ని కాపాడే ప్రకటనలు ఉండాలని సూచించారు. మిషన్ కాకతీయలో భాగంగా రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నీటిపారుదల శాఖ అధికారులను అదేశించారు. గుట్టపైన కొన్ని వాహనాలు నిలిపి ఉంచే విధంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. గుట్టపైన నిర్మించే ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహానికి కావాల్సిన రాయి ఎక్కడ లభిస్తుందో తెలుసుకుని, మంచి నైపుణ్యమున్న శిల్పులకు పని అప్పగించాలని ఆధికారులను ఆదేశించారు. గుట్టను అభివృద్ది చేయడానికి ప్రభుత్వ నిధులతోపాటు అనేకమంది దాతలు, కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు ముందుకు వచ్చే అవకాశముందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి కృష్ణవేణి, ఈవో గీతారెడ్డి, ఆలయ అర్చకులు, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.  
 
 రోడ్లకు నేడు టెండర్ నోటిఫికేషన్
 యాదగిరిగుట్టకు నాలుగు లేన్లతో రోడ్ల అభివృద్ధికి అధికారులు ఆగమేఘాలమీద చర్యలు చేపట్టారు. దేవాలయానికి వెళ్లాలంటే  హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి నుంచి లోపలికి ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి. భవిష్యత్తులో భక్తుల రద్దీ దృష్ట్యా జాతీయ రహదారికి అనుసంధానంగా నాలుగు లేన్ల రోడ్డును నిర్మించాలని సీఎం ఆదేశించారు. పది రోజుల్లో టెండర్ కసరత్తు పూర్తి చేయాలని గడువు విధించారు. దీంతో రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ సహా ఇతర అధికారులను పిలిపించి.. బుధవారం రాత్రే టెండర్ నోటిఫికేషన్ పనులు పూర్తి చేయాల్సిందిగా ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దీంతో అధికారులు అర్ధరాత్రి వరకు కూర్చుని అంచనా వ్యయం సిద్ధం చేసి, అందుకు తగ్గట్టుగా నిధుల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను రూపొందించి మంత్రితో సంతకం తీసుకున్నారు. గురువారం టెండర్ నోటిఫికేషన్ వెలువడనుంది.
 
 అధికారుల ప్రణాళిక ప్రకారం రాయగిరి క్రాస్‌రోడ్డు నుంచి గుట్టకు ప్రస్తుతమున్న రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్లుగా మార్చాలని నిర్ణయించారు. 5.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ రోడ్డుకు రూ. 80 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మార్గంలో రైల్వేలైన్ ఉన్నందున అక్కడ ఫ్లైఓవర్  నిర్మించాల్సి ఉంటుంది. ఇక ఆలేరువైపు నుంచి గుట్టకు వెళ్లేందుకు ప్రస్తుతం సింగిల్ రోడ్డు అందుబాటులో ఉంది. దాన్ని రెండు లేన్లుగా మార్చాలని నిర్ణయించారు. అలాగే తుర్కపల్లి గ్రామం నుంచి గుట్ట వరకు రెండు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ. 7.50 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.

Advertisement
Advertisement