భయం గుప్పిట్లో విధులు | Sakshi
Sakshi News home page

భయం గుప్పిట్లో విధులు

Published Sun, Jul 19 2015 11:50 PM

Fear of the control functions

రైల్వే శాఖలో పనిచేస్తున్న గేట్‌మెన్‌లు భయంగుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. గేట్ల వద్ద ఏర్పాటు చేసిన రూంలు శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలం కావడంతో ఎప్పుడు కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. సమస్యపై ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 వికారాబాద్ : దేశంలో అత్యధిక ఆదాయాన్ని సంపాదించే రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. వికారాబాద్ నుంచి జహిరాబాద్ వరకు ఉన్న రైల్వే గేట్లల్లో విధులు నిర్వహిస్తున్న గేట్‌మెన్‌ల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. వికారాబాద్ మొదలుకొని జహీరాబాద్ వరకు ఎల్‌సీ లెవల్ క్రాసింగ్ గేట్లు 33 వరకు ఉన్నాయి. గేట్‌మెన్‌లు విధులు నిర్వహించేందుకు గేట్ల వద్ద రైల్వే శాఖలో ఐఓడబ్ల్యు విభాగం రూంలను ఏర్పాటు చేసింది. వాటిని చాలాకాలం క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరాయి.

 దీంతో ఎప్పుడు కూలుతాయోననే భయం విధులు నిర్వహిస్తున్న గేట్‌మెన్‌లను వెంటాడుతోంది. వర్షాలు పడ్డాయంటే చాలు రూంలో ఉండాల్సిన గేటు మెన్‌లు రూం బయట వర్షంలో నిలబడాల్సి వస్తుంది.

 వర్షానికి తడిసి ఎక్కడ కూలిపోతాయేనన్న భయాందోళనలో వారు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్ని సార్లు ఉన్నతాధికారులకు గేట్ల పరిస్థితిపై విన్నవించిన పట్టించుకున్న పాపానపోవడం లేదని గే ట్‌మెన్‌లు వాపోతున్నారు. గేట్‌మెన్‌ల కోసం నిర్మించిన కాలం చెల్లిన నిర్మాణాలను తొలగించాలని పలుమార్లు రైల్వే కార్మిక సంఘాలు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

 గేట్‌మెన్‌లను వేధిస్తున్న సమస్యలివే..
 తాగడానికి గేట్‌మెన్ రూంల దగ్గర వేసిన బోర్లు పనిచేయవు. పనిచేసిన అందులో తాగడానికి నీరు ఉండదు. 1 నుంచి 33 గేట్ల వరకు ఎక్కువ శాతం మంచినీరు తాగడానికి సైతం అందుబాటులో లేక గేట్‌మెన్‌లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరమ్మతులను పట్టించుకోవాల్సిన ఐఓడబ్ల్యు శాఖ అధికారులు మొద్దు నిద్ర వహిస్తుండడంతో గేట్‌మెన్‌ల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాత్రి పూట కరెంట్‌లేని గేట్లు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా బాతురూంలు లేవు. డ్యూటీ రోస్టార్ అంటూ 12 గంటలపాటు విధులు నిర్వహించాల్సిందే. ఒక వేళ రిలీవర్ రాకపోతే మళ్లీ 12 గంటలపాటు తిండితిప్పలు లేకున్నా విధులు నిర్వహించాల్సిందే. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గేట్‌మెన్‌ల సమస్యలను పరిష్కరించాలని  కోరుతున్నారు.

Advertisement
Advertisement