‘భద్రత’ నిర్బంధం! | Sakshi
Sakshi News home page

‘భద్రత’ నిర్బంధం!

Published Tue, Dec 30 2014 4:30 AM

‘భద్రత’ నిర్బంధం! - Sakshi

జనగామ రూరల్/నల్లబెల్లి/నర్మెట : జనగామ మండలంలోని పెద్దరాంచర్లలో ఆహార భద్రత కార్డుల జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యూయని వీఆర్‌ఓ అబ్బ సాయిలును స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్బంధించారు. అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేయూలని, పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ బన్సీలాల్ హామీ ఇవ్వడంతో వీఆర్‌ఓను వదిలేశారు. అదేవిధంగా నల్లబెల్లి మండలంలోని రాంతీర్థం గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన వీఆర్‌ఓ రాఘవులుతోపాటు వీఆర్‌ఏ అశ్విని, కారోబార్ శివకర్ణను ప్రజలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు.

అర్హులైన తమకు ఆహార భద్రత కార్డు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ఆర్డీఓ వచ్చి సమాధానం చెప్పే వరకు వదిలేది లేదని గ్రామ పంచాయతీ ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. వార్డు సభ్యులు పొదుల శోభన్, గొట్టి ముక్కుల మల్లాచారి, బీజేపీ నాయకుడు మాలోత్ మహేందర్‌సింగ్, రాజారతన్‌సింగ్, భద్రు ప్రజల ఆందోళనకు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు రాంతీర్థం గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని ప్రజలను శాంతింపజేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రజలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నెట్టివేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తహసీల్దార్ డీఎస్.వెంకన్న ఫోన్ ద్వారా హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.

వాంకుడోతు గోపాల్, బొచ్చు శ్రీను, మాలోత్ సరోజన, బొర్ర భాగ్య, కల్వాల శైలజ, గుగులోత్ సీత  తదితరులు పాల్గొన్నారు. నర్మెట మండలం వెల్దండ, కన్నెబోయినగూడెం, అమ్మపురం, గండిరామవరం, బొత్తలపర్రె, బొంతగట్టునాగారం, అంకుషాపుర్ గ్రామాల్లో జాబితాను చదివి వినిపిస్తుంటే.. ఆయా గ్రామాల ప్రజలకు అర్హులకు ఆహార భద్రత కార్డులు అందించలేదని ప్రజాప్రతినిధులు, అధికారులతో గొడవకు దిగారు.

కాగా, జనగామ మండలం పెద్దరాంచర్లలో వీఆర్ ఓ విధులకు ఆటంకం కలిగించినందుకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు. సర్పంచ్ వల్లాల మల్లేశం, సంతోష్‌రెడ్డి, బత్తిని వేణు, శివరాత్రి మల్లయ్య, నాయిని బాబు, బత్తిని సిద్దులు, పొన్నాల ప్రభాకర్‌రెడ్డిలపై 143, 342, 363 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

Advertisement
Advertisement