ముసాయిదా ఓటరు జాబితా రెడీ | Sakshi
Sakshi News home page

ముసాయిదా ఓటరు జాబితా రెడీ

Published Wed, May 3 2017 2:50 AM

ముసాయిదా ఓటరు జాబితా రెడీ - Sakshi

నల్లగొండ: ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం ప్రకటించారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా... దాంట్లో నల్లగొండ మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఓటరు నమోదు కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించారు. ఐదు నియోజకవర్గాల్లో పురుషులు, మహిళలు కలిపి 9,30,918 మంది ఉన్నారు. దీంట్లో పురుషులు 4,68,974, మహిళలు 4,61,921, ఇతరులు 23 మంది ఉన్నారు.

కొత్త దరఖాస్తులు తహసీల్దారు కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాల్లో స్వీకరిస్తారు. ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తులు, ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు పైన తెలిపిన అన్ని కార్యాలయాల్లో తీసుకుంటారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 4,11 తేదీల్లో గ్రామ, పట్టణాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారు. ఈ నెల 7, 14 తేదీల్లో బూత్‌ స్థాయి అధికారి, రాజకీయ పార్టీల ద్వారా నియమించిన బూత్‌స్థాయి ఏజెంట్ల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. దరఖాస్తులు, అభ్యంతరాల పైన ఈ నెల 31న విచారిస్తారు. విచారించిన దరఖాస్తులను జూన్‌ 9న కంప్యూటరీకరిస్తారు. జూన్‌15న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.

వీరిని తొలగిస్తారు..
చనిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు
శాశ్వతంగా నివాసం వదిలి వెళ్లిన (వలసలు) వారి పేర్లు,  రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారిని జాబితా నుంచి తొలగిస్తారు.
ఓటరు నమోదు చేసుకునే వారు పైన తెలిపిన కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చును.

నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ..
ఆరు నియోజకవర్గాలకు ఓటరు నమోదు ప్రత్యేక అధికారులుగా ఎన్నికల సంఘం నియమించింది. మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాలకు ఆర్డీఓలు, మునుగోడు వి.చంద్రశేఖర్‌ రెడ్డి (స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌), నకిరేకల్‌కు జెడ్పీ సీఈఓ హనుమానాయక్‌ను నియమించారు. నల్లగొండలో మాత్రం ప్రత్యేకంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమం చేపడతారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్‌ ఖరారు చేసింది.

ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌: ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి  వివరాలు తెలుసుకునేందుకు, ఓటర్లు తమ పేర్లున నమోదు చేసుకునేందుకు, మార్చుకునేందుకు, ఏదైనా సమాచారాన్ని తెలిపేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కార్యాలయంలో టోల్‌ ఫ్రీ నంబరు 18004251442 ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement