గోదారి.. | Sakshi
Sakshi News home page

గోదారి..

Published Tue, Jul 14 2015 4:27 AM

గోదారి.. - Sakshi

నేటి నుంచి పుష్కరాలు
- మూడు ఘాట్లలో పుణ్యస్నానాలు
- 10 లక్షల మంది వస్తారని అంచనా
- అడుగడుగునా పోలీస్ బందోబస్తు
- ప్రతీ ఘాట్ వద్ద ‘షీ టీం’
- 24 గంటలపాటు వైద్య సేవలు
- 99 మంది పురోహితులు
- మంగపేట ఘాట్‌లో అధికారికంగా ప్రారంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్ :
పుష్కర కాలం తర్వాత గోదావరికి శోభ వస్తోంది. లక్షల మంది భక్తుల పుష్కర స్నానంతో గోదావరి పులకించే సమయం వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి... 12 రోజులపాటు జరిగే పవిత్ర గోదావరి నది పుష్కరాలు మంగళవారం మొదలవుతున్నాయి. ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. గోదావరి తీరంలోని రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపేటలో పుష్కర స్నానాల కోసం ఘాట్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలో అధికారికంగా మంగపేట ఘాట్ వద్ద పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. మంగళవారం ఉదయం 6.27 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగపేట ఘాట్ వద్ద గోదావరి పుష్కరాలను ప్రారంభిస్తారు.

అంతకుముందు మల్లూరు శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం నుంచి మంగపేట ఘాట్ వరకు శోభ యాత్ర ఉంటుంది. మంగపేటలో 100 మీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి. రామన్నగూడెంలో 300 మీటర్ల నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. ముల్లకట్ట ఘాట్ వద్ద నీళ్లు అందుబాటులో లేవు. ముల్లకట్ట ఘాట్ పుష్కర స్నానానికి ఇబ్బందిగానే ఉందని అధికారులు చెబుతున్నారు. పుష్కరాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.కరుణ తెలిపారు.
 - వరంగల్ రూరల్ జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోదావరి పుష్కరాలకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

మూడు ఘాట్లు, వరంగల్ నుంచి గోదావరి వరకు రహదారి మార్గంపై, అన్ని చోట్ల కలిపి 2 వేల మంది పోలీసులను పుష్కరాల విధులకు నియమించారు. నలుగురు డీఎస్పీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు... భారీగా పోలీసులను మోహరించారు. మూడు ఘాట్‌ల వద్ద మహిళల భద్రత కోసం ‘షీ టీం’లను ఏర్పాటు చేశారు. ప్రతి టీంలో 15 మంది పోలీసులు ఉంటారు. దొంగతనాల నివారణకు ప్రత్యేకంగా నాలుగు యాంటీ క్రైం బృందాలను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. చిన్నపిల్లలు, తప్పిపోయిన వారికి సహాయంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి హెల్ప్ డెస్క్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షిస్తారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 100కు ఫోన్ చేయాలి. తప్పిపోయిన వారి సమాచారం ఇస్తే మైక్‌లో అనౌన్స్‌చేసి సహకరిస్తారు.  
 
రామన్నగూడెం ఘాట్‌కు అర కిలోమీటరు దూరంలోని 3 ఎకరాల్లో, ముల్లకట్ట ఘాట్‌కు 400 మీటర్ల దూరంలో 10 ఎకరాల్లో, మంగపేట ఘాట్‌కు 2 కిలో మీటర్ల దూరంలో గంపోనిగూడెం వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్‌కోసం ఏర్పాట్లు చేశారు. మంగపేట పార్కింగ్ ప్రాంతం నుంచి భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక షటిల్ సర్వీస్ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులలో భక్తులను ఉచితంగా ఘాట్ వద్దకు చేరుస్తారు. ట్రాఫిక్ నియంత్రణకు ములుగు మండలం హమ్మద్‌గౌస్‌పల్లి నుంచి ఘాట్‌ల వరకు 15 ప్రాంతాల్లో 1+1 సెక్యూరిటీ ఉంటారు. రామప్ప, లక్నవరం, మల్లూరు, గట్టమ్మ వద్ద ప్రతి ప్రాంతంలో 50 మంది బలగాలు ఉంటాయి. మంగపేట మండలం రాజుపేట, ఏటూర్‌నాగారం, జంగాలపల్లి క్రాస్, గూడెప్పాడ్, తాడ్వాయిలలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.                                                                                                                                                                                                                                                                                         
పుష్కరాలకు వచ్చే భక్తులు ఆరోగ్య పరమైన ఇబ్బందు లు పడకుండా 24 గంటలు సేవలు అందించేలా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఒక్కో పుష్కర ఘాట్ వద్ద 32 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రతి ఘాట్‌కు ఐదుగురు చొప్పున వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రతి క్యాంపులో గైనకాలజిస్టు, జనరల్ ఫిజీషియన్, పిల్లల వైద్యుడు, అవసరమైతే సర్జన్ అందుబాటులో ఉండేలా వైద్య శాఖ చర్యలు చేపట్టింది. ఒక్కో ఘాట్ వద్ద రెండు చొప్పున 108, 104 వాహనాలు అందుబాటులో ఉంటాయి. మంగపేటలో వైద్య సేవల కోసం పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
 
పుష్కరాలకు వచ్చే భక్తుల పూజలు, ఇతర పూజ కార్యక్రమాల కోసం దేవాదాయ శాఖ 99 మంది పురోహితులను నియమించింది. ఒక్కో పుష్కర ఘాట్ వద్ద 33 మంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. పుష్కర ఘాట్ల సమీపంలోని ఆలయాల్లోనూ పురోహితులను నియమించారు. పూజ కార్యక్రమాల వారీగా నిర్ణీత ధరలను పేర్కొంటూ ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేస్తోంది. దేవాదాయ శాఖ నియమించిన పురోహితులకు గుర్తింపు కార్డులు ఉంటాయి.
 పూజా సేవల ధరలు(రూపాయలలో) : మహాసంకల్పం 151, మూసివాయినం 201, పిండ ప్రదానం 251, లవణదానం 101, గంగపూజ 51, పరిగంగస్నానం 51, గౌరి పూజ 51, ప్రాయశ్చిత్తం 51, నదీస్నానం 51, తీర్థ విధులు 51. పూజా సామగ్రి... పిండ ప్రధానం కిట్ 145, గంగాపూజ కిట్ 100.

Advertisement
Advertisement