మీరు రాజీనామా చేస్తే నేనూ సిద్ధమే.. | Sakshi
Sakshi News home page

మీరు రాజీనామా చేస్తే నేనూ సిద్ధమే..

Published Sat, Dec 13 2014 4:08 AM

మీరు రాజీనామా చేస్తే నేనూ సిద్ధమే.. - Sakshi

ఖమ్మం జెడ్పీ సెంటర్ : టీడీపీలో కొనసాగుతున్న ఆ నలుగురు నేతలు ప్రతీరోజూ  పార్టీ మారనని దూషణలకు దిగుతున్నారని, వాళ్లను, ఆ పార్టీని ఎన్నడూ విమర్శించలేదని, కుట్రలతో విమర్శలు చేస్తున్న నాయకులకు ధైర్యముంటే రాజీనామా చేయాలని, అందుకు తానుకూడా సిద్ధమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత సవాల్ విసిరారు. శుక్రవారం ఆమె క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను టీడీపీ కోసం అహర్నిషలు పని చేశానని, ఉద్యోగాన్ని సైతం వదులుకుని అంకితభావంతో కార్యకర్తగా ఉన్నానని అన్నారు. ప్రజల ఆదరణతో చైర్‌పర్సన్‌ను అయ్యానని వివరించారు.

జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీల అందరి నిర్ణయంతో, ప్రజలందరి మద్దతుతోనే తుమ్మల నాయకత్వంలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లామని వివరించారు. విమర్శలు చేస్తున్న నాయకులను ఎన్నికల్లో గెలిపించేందుకు,అన్ని వర్గాల ప్రజలు, నేతలు, కార్యకర్తల కృషి, ఓట్లతో గెలిచారని, మమ్మల్ని రాజీనామ చేయమనే ముందు వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు  తానుకూడా రాజీనామాకు సిద్ధమేనన్నారు. విమర్శలను ఇకనైనా మానుకోవాలని లేకుంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. అసలు రాజీనామా ఎందుకు చేయాలనేది ముందు చెప్పాలన్నారు. చర్చకు వస్తానంటే అది ప్రెస్ క్లబ్,సంచాయతీరాజ్ కమిషనర్ వద్ద, అసెంబ్లీలోనా ఎక్కడైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

కన్నతల్లిలాంటి పార్టీని ముంచాలనే లక్ష్యంతో ప్రతీసారి నాయకులకు వెన్నుపోటు పొడిచారని, అదే తరహాలో తనకు సైతం 2000 సంవత్సరంలో కొత్తగూడెం చైర్మన్‌గా పనిచేసిన సమయంలో, ఇటివల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో  సైతం అదే ధోరణితో వ్యవహరించారని అన్నారు. 2010లో సైతం పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తే అప్పుడు చంద్రబాబుతో ఒత్తిడి తెప్పి అడ్డుకున్నారని అన్నారు. అలాగే చైర్ పర్సన్ ఎన్నిక రోజు కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. అయినా ఎన్నాడు ఎవరిని వ్యక్తి గతంగా దూషించలేదని, సహనం ఓర్పుతో ఉన్నా ఇంకా ఇలాంటి విమర్శలకు దిగడం సరికాదని అన్నారు.

కేసిఆర్ కాళ్ళు మొక్కి అత్మగౌరవాన్ని తాకట్టు పెట్టానని విమర్శలు చేస్తున్నారని, పెద్దలను గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయమని, చైర్ పర్సన్‌గా ఎన్నికైన రోజు కూడా టీడీపీలోని సీనియర్ నాయకులు పంచాక్షరయ్య కాళ్లకు మొక్కానని, అంత మాత్రాన అది కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టినట్లేనా అని ప్రశ్నించారు. ఆరోజు మాట్లాడని నాయకులు ఈ రోజు విమర్శల చేయడం సహేతుకం కాదన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాయకత్వంతో జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు ప్రభంజనంలా వెళ్లామని గుర్తు చేశారు.

Advertisement
Advertisement