గవర్నర్‌ ప్రసంగం అబద్ధాల పుట్ట | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ ప్రసంగం అబద్ధాల పుట్ట

Published Sat, Mar 11 2017 3:10 AM

గవర్నర్‌ ప్రసంగం అబద్ధాల పుట్ట - Sakshi

ప్రజల దృష్టి మళ్లించేందుకే
సర్వే నాటకం: వైఎస్సార్‌ సీపీ


సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ తెలివిగా గవర్నర్‌ చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డిలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మొదటి అసెంబ్లీ సమావేశంలో చెప్పి, ఇంతవరకు 3,500 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి, 30 వేలు ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమానికి ముందు అబద్ధాలే, ఉద్యమంలో, ఎన్నికల్లో, మ్యానిఫెస్టోలో, మంత్రివర్గ, అసెంబ్లీ సమావేశాల్లో, చివరికి పంద్రాగష్టు రోజు కూడా కేసీఆర్‌ అబద్ధాలే చెప్పి కాలాన్ని నెట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. ‘మీ అబద్ధాల రహస్యాన్ని ప్రజలు గుర్తించారు, సమయం కోసం కాచుకొని ఉన్నారు’అని చెప్పారు. గవర్నర్‌ ప్రసంగంలోని అబద్ధాలను గుర్తించకుండా ప్రజలు, రాజకీయ పక్షాలు, ఎమ్మెల్యేల దృష్టిని మళ్లించేందుకే కల్పితాల సర్వేను విడుదల చేశారని విమర్శించారు.

ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 119కిగాను 101 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొనటం హాస్యాస్పదమని, 10 స్థానాలే టీఆర్‌ఎస్‌కు వస్తాయని అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ముందు 1.60 లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని ప్రచారం చేసి 99 కార్పొరేటర్‌ స్థానాలు కైవసం చేసుకొన్న సీఎం కేసీఆర్‌ కనీసం ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌నైనా ఎక్కడైనా కట్టించారా అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement