తల్లిదండ్రులు మందలించారని.. | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని..

Published Tue, Dec 15 2015 3:26 AM

తల్లిదండ్రులు మందలించారని.. - Sakshi

ముంబైలో బాలిక అదృశ్యం.. వికారాబాద్‌లో ప్రత్యక్షం తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
 వికారాబాద్ రూరల్:
మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించారని మనస్తాపం చెందిన ముంబై బాలిక ఇంట్లోంచి వచ్చింది. వికారాబాద్‌కు చేరుకున్న ఆమెను స్థానిక పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంషొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... ముంబై థానే సమీపంలోని అమృత్‌నగర్‌కు చెందిన బాలిక జోయా(15) స్థానిక యూనివర్సల్ ఆర్టిక్ బీహాండ్ మోహ్ర ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

 ఈనెల 12న పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని బాలికను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన జోయా ఇంట్లోంచి బయటకు వచ్చింది. మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వికారాబాద్‌కు చేరుకుంది. ఉదయం 11.30 నుంచి వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో కూర్చున్న జోయాను ఆర్‌పీఎఫ్ సిబ్బంది గమనిస్తుండగా సాయంత్రం సమయంలో  ఫినాయిల్ తాగేయత్నం చేసింది. వెంటనే అడ్డుకున్న ఆర్‌పీఎఫ్ పోలీసులు 1098 చైల్డ్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ సిబ్బంది దేవకుమారి, రామేశ్వర్‌లు అక్కడికి చేరుకుని వికారాబాద్ పోలీసులకు విషయం చెప్పారు. అనారోగ్యంగా ఉన్న బాలికను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె చెప్పిన సమాచారంతో తన తల్లిదండ్రులకు వివరాలు తెలియజేశారు. బాలికను సోమవారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది డిశ్చార్జి చేశారు. పోలీసులు ఆమెను చైల్డ్‌లైన్ అధికారులు సమక్షంలో ఉంచారు.

 జోయా తల్లిదండ్రులు వికారాబాద్‌కు చేరుకుని పోలీసులను సంప్రదించారు. జోయా 12వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తల్లిద ండ్రుల ఫిర్యాదు మేరకు ముబ్రా ఠాణాలో కిడ్నాప్ కేసుగా నమోదు చేశామని ఇక్కడికి వచ్చిన సంబంధింత ఠాణా కానిస్టేబుల్ తెలిపాడు. బాలికను హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీకి అప్పగించి వారి ద్వారా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. అదృశ్యమైన బాలిక క్షేమంగా దొరకడంతో జోయా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement