మంజీరా.. ఎడారే | Sakshi
Sakshi News home page

మంజీరా.. ఎడారే

Published Mon, Aug 31 2015 3:43 AM

మంజీరా.. ఎడారే - Sakshi

మంజీరా నది.. కాలక్రమేణా ఎడారిగా మారబోతుందా? దీని చెంతనే ఉన్న డీఫ్లోరైడ్ పథకానికి ముప్పు ఏర్పడనుందా? మంజీరా నదిలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో ప్రజలను ఈ ప్రశ్నలు కలవరపెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు. ‘ఇది నిజం. భవిష్యత్తులో జరిగేది ఇదే’ అని, వారు తీవ్ర భయూందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఇసుక రవాణాను అడ్డుకోకపోతే జరిగేది ఇదే
- భయూందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు
- ఇసుక తవ్వకాలతో ఢీఫ్లోరైడ్ పథకానికి ముప్పు..
- అయినప్పటికీ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వ అనుమతి
కోటగిరి :
ఒకవైపు, వర్షాభావ పరిస్థితులతో ఎక్కడికక్కడ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మరోవైపు, భూగర్భ జలాలను పరిరక్షించే నదుల్లోని ఇసుకను ఆసాంతం తోడేసేందుకు ప్రభుత్వం అనుమతినిస్తోంది. ప్రజల ప్రయోజనాలను విస్మరించిన ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటగిరి మండలం పోతంగల్, కారేగాం మంజీరా నుంచి ఇసుక తవ్వకాలు.. రవాణాకు టీఎస్ ఎండీసీ అనుమతి ఇవ్వడంపై ఆయూ గ్రామాల రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.
 
ఢీఫ్లోరైడ్ పథకానికి ముప్పు
కారేగాం మంజీరా చెంతన ఢీఫ్లోరైడ్ పథకం ఉంది. సిరికొండతోపాటు బోధన్ మండలంలోని పలు గ్రా మాలకు ఇక్కడి నుంచి డీఫ్లోరైడ్ నీరు సరఫరా అవుతోంది. మంజీరా నుంచి ఇసుక తరలింపుతో ఈ డీ ఫ్లోరైడ్ పథకానికి మున్ముందు ముప్పు (నీళ్లు అందని పరిస్థితి) ఏర్పడే ప్రమాదముందని సిరికొండ, బోధన మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు
పోతంగల్, కారేగాం మంజీరా నుంచి ఇసుకను రవాణా చేస్తున్న లారీలను ఆయూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తే భూగర్బ జలాలు అడుగంటే ప్రమాదముందని, అందుకే లారీలను అడ్డుకున్నామని వారు చెబుతున్నారు. ఇసుకను తరలించవద్దంటూ వారంతా రోడ్డెక్కారు.
 
బైండోవర్ కేసులు
ఇసుక లారీలను అడ్డుకున్న ప్రజలపై అధికారులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. అంతేకాదు.. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్న వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తాం’ అని, అధికారులు బెదిరిస్తున్నారు.
 
అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట
ఇసుక రవాణాను నిలిపివేయాలని కోరుతూ కారేగాం గ్రామస్తులు ఇటీవల బోధన్ ఆర్డీఓకు వినతిపత్రమిచ్చారు. పోతంగల్ గ్రామస్తులు కూడా ఇటీవల కోటగిరి తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. తవ్వకాల కోసం ఒకచోట అనుమతి తీసుకుని.. మరోచోట తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. మంజీరా చెంతనే బ్రిడ్జి, ఢీఫ్లోరైడ్ పథకం ఉన్నాయని.. ఇసుక తవ్వకాలతో వీటికి మున్ముందు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement