బడికిక బైబై! | Sakshi
Sakshi News home page

బడికిక బైబై!

Published Fri, Apr 13 2018 11:21 AM

Government Schools Summer Holidays From Today - Sakshi

కొత్తగూడెం:  వేసవి సెలవులొచ్చేశాయ్‌.. విద్యార్థులు ఇంటి బాట పట్టారు. 2017–18 విద్యా సంవత్సరం గురువారంతో ముగిసింది. దీంతో విద్యార్థులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. కేరింతలతో స్నేహితులకు, స్కూళ్లకు టాటా చెబుతూ ఇళ్లకు వెళ్లారు. ప్రభుత్వ, సంక్షేమ పాఠశాలలతో పాటు జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు  గురువారం నుంచి మే 31 వరకు సెలవులు ప్రకటించాయి. గతంలో జూన్‌ 12,13 తేదీలలో బడులు తిరిగి ప్రారంభమయ్యేవి. అయితే తెలంగాణ వచ్చాక జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉండటంతో వేడుకలకు ఇబ్బందిగా మారింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోనూఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా జూన్‌ 1నే పాఠశాలలు తెరుస్తున్నారు.

వేసవి తరగతులకు అడ్డుకట్ట పడేనా..
 జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ముందస్తుగానే బోధన సాగిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహించరాదని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టించుకోకుండా ర్యాంకుల కోసం పది, ఇంటర్‌ విద్యార్థులను వేసవిలోనే ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో వారు మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు వేసవి తరగతులకు అడ్డుకట్ట వేస్తారో.. లేదో వేచి చూడాలి.

గత ఏడాది ఆశించిన ఫలితాలేవీ..?
జిల్లాలో 2017–18 విద్యా సంవత్సరంలో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రధానంగా జిల్లాలో డీఈవోగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన హయగ్రీవాచారి అనంతరం అత్యధిక కాలం ఇన్‌చార్జ్‌ డీఈవోల పాలన కొనసాగటంతో జిల్లాలో విద్యాశాఖ పనితీరు అగమ్యగోచరంగా మారింది. జిల్లాకు ఇన్‌చార్జి డీఈవోగా ఉన్న వాసంతికి జనవరి తర్వాత  పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. అప్పటికే పదో తరగతి పరీక్షల సిలబస్‌ పూర్తి కావడంతో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుపై పర్యవేక్షణ లోపించింది. దీంతో అప్పటి వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ప్రధానంగా విద్యార్థుల్లో వెనుకబడిన కనీస అభ్యసన సామర్థ్యాల కార్యక్రమం త్రీఆర్స్, నేషనల్‌ ఎచీవ్‌మెంట్‌ సర్వే పరీక్షల ఫలితాలు సైతం ఈ నిజాలను బహిర్గతం చేశాయి. ఉపాధ్యాయుల సమస్యలు సైతం ఎక్కడివక్కడే పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. అయితే విద్యా సంవత్సరం చివరిలో బాధ్యతలు స్వీకరించిన డీఈవో వాసంతి.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినప్పటికీ ఫలితాల సాధనలో ఏ మేరకు సఫలీకృతులు అవుతారో వేచి చూడాలి. 

వేసవిలో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు
 నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.  వేసవి సెలవులు విద్యార్థులకు సద్వినియోగం అయ్యేలా తల్లిదండ్రులు కృషి చేయాలి. తొర్రూరులోని కస్తూర్బా పాఠశాలలో సమ్మర్‌ క్యాంపులో పలు కో కరిక్యులర్‌ అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థుల్లో సైన్సు, సాంకేతిక ఆలోచనను రేకిత్తించే ‘ఇన్‌స్పైర్‌’కు పలు రకాల ప్రయోగాలను సిద్ధం చేసుకోవాలి. జిల్లాలో గుర్తింపు లేని ప్రైవేట్‌ పాఠశాలలపై కేసులు నమోదు చేయనున్నాం. ప్రతి పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి.
– డి.వాసంతి,జిల్లా విద్యాశాఖాధికారిణి

Advertisement

తప్పక చదవండి

Advertisement