ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: కిషన్‌ రెడ్డి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: కిషన్‌ రెడ్డి

Published Sun, Oct 15 2017 2:06 AM

The government should help  farmers - Sakshi

పరిగి: ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన అన్నదాతను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన రైతు భరోసా యాత్ర పేరుతో వికారాబాద్‌ జిల్లా దోమ, కుల్కచర్ల మండలాల పరిధిలోని ఐనాపూర్, మల్లేపల్లి, దాదాపూర్, అంతారం, ఇప్పాయిపల్లి, రాంపూర్‌ గ్రామాల్లో పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకే ఈ పర్యటన చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నష్ట వివరాలతో నివేదికను ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలను అందిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలసి బీజేపీ తరఫున మెమోరాండం అందిస్తామన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన సీఎంను డిమాండ్‌ చేశారు.

సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమీక్షలు ప్రగతి భవన్‌కే పరిమితమయ్యాయన్నారు. కేంద్రం ఇచ్చిన కరువు సాయం రాష్ట్ర ప్రభుత్వం మింగేసి రైతులకు మొండిచేయి చూపిస్తోందని ఆరోపించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతాదేవి, జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, రాష్ట్ర నాయకులు నందకుమార్, వెంకటయ్య, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement