Sakshi News home page

తిరస్కరణ సరే.. ఫీజు సంగతేంటీ..?

Published Thu, Apr 19 2018 2:14 AM

Govt Rejecting LRS Applications - Sakshi

సాక్షి, హైదరాబాద్‌

  • నాదర్‌గుల్‌లో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు కింద ప్లాట్‌ ఉందంటూ విజయ్‌ పెట్టుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. 
  • హయత్‌నగర్‌లో ఇండస్ట్రియల్‌ జోన్‌ కింద ప్లాట్‌ ఉందంటూ వెంకట్‌ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. 

..ఇలా అనేక కారణాలతో భారీ సంఖ్యలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తులను హెచ్‌ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దాదాపు లక్షా 75 వేల దరఖాస్తులు రాగా.. అందులో 98 వేల దరఖాస్తులను క్లియర్‌ చేయగా, మరో 77 వేల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను తిరస్కరించడం వరకు బాగానే ఉన్నా.. దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రారంభ చెల్లింపు(ఇనీషియల్‌ పేమెంట్‌) కింద ఒక్కో దరఖాస్తుదారుడు చెల్లించిన రూ.పది వేలను తిరిగి వెనక్కి ఇచ్చేది లేదని అధికారులు చెపుతుండటం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్‌ అవసరాల కోసం ఎంతో కష్టపడి ప్లాట్‌ కొనుగోలు చేశామని, ఇప్పుడూ ఆ ప్లాట్‌ మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో పోతుందంటూ తిరస్కరించారని, అయితే కట్టిన ప్రారంభ ఫీజు రూ.పది వేలను వెనక్కి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డబ్బులు తిరిగి ఇచ్చేలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

77 వేల దరఖాస్తుల తిరస్కరణ 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నగరంలో ఉంటున్నారు. దినసరి కూలీ దగ్గరి నుంచి వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వరకు అహర్నిశలు శ్రమించి సొంతింటి కలను నిజం చేసుకునేందుకు శివారు ప్రాంతాల్లో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. కొందరు పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని, మరికొందరు భవిష్యత్‌లో ఇల్లు కట్టుకుని ఉందామని.. ఇలా అనేక ఆశలతో గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లు తీసుకున్నారు. పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజుగా «రూ.పది వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. అయితే ఇప్పుడు అవే ప్లాట్లు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో ఉన్నాయని, శిఖం, నాలా, చెరువులో వస్తున్నాయనే కారణాలతో దాదాపు 77 వేలకుపైగా దరఖాస్తులను హెచ్‌ఎండీఏ తిరస్కరించింది. ‘ఏళ్ల క్రితం కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లాట్లు బాగానే ఉన్నాయి. అయితే మాస్టర్‌ ప్లాన్‌లో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు, ఇండస్ట్రీయల్‌ జోన్‌లో ఉన్నాయంటూ ఇప్పుడూ అధికారులు సమాధానాలు చెబుతున్నారు. 

జీవోలో లేదంటున్న అధికారులు.. 
‘‘మేము కొనుగోలు చేసినప్పుడూ ఇవేమీ లేవు. కొత్తగా తీసుకొచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ తప్పుల తడకగా ఉండటం వల్ల ప్లాట్‌ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. వాటిని అమ్మినా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పోనీ మేము దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.పది వేలు అయినా ఇవ్వాలని కోరినా హెచ్‌ఎండీఏ అధికారులు కుదరదని చెపుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే.. జీవో 151లో ఆ ప్రస్తావన ఎక్కడా లేదని తిరిగిపంపుతున్నారు’అని హెచ్‌ఎండీఏకు వచ్చిన ఓ దరఖాస్తుదారుడు వాపోయాడు. లక్షా 75 వేల మందికిపైగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు సమయంలో ప్రారంభ ఫీజుగా రూ.పది వేలు చెల్లించారు. వీరిలో 98 వేల మందికి ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ అయి ఫీజుల ఎస్‌ఎంఎస్‌ వస్తే.. ప్రారంభ ఫీజు రూ.పది వేలను మినహాయించి మిగతా ఫీజును చెల్లించారు. తిరస్కరణకు గురైన 77 వేల మందికి ప్రారంభ ఫీజును తిరిగి ఇచ్చేదే లేదని, జీవో 151లో ఆ ప్రస్తావన లేదని అధికారులు చెబుతున్నారు. అయితే దరఖాస్తు సమయంలో రూ.పది వేలకు మించి ఎక్కువ మొత్తం చెల్లించినవారివి తిరస్కరిస్తే ఆ పది వేలు మినహాయించి మిగతా డబ్బును చెల్లిస్తున్నామని అంటున్నారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ అయిన వారికి ప్రారంభ ఫీజును మినహాయించి మిగతా ఫీజును చెల్లించమన్నట్టుగానే, తిరస్కరణకు గురైన వారికి ప్రారంభ ఫీజును తిరిగి చెల్లించాలని దరఖాస్తుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

జీవో 151లో ఏముందంటే.. 
ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.పది వేలు చెల్లించవచ్చు. లేదంటే దీంతో పాటు మరో పది శాతం డబ్బులు చెల్లించవచ్చని జీవో నంబర్‌ 151లో ప్రభుత్వం పేర్కొంది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ రూ.పది వేలు చెల్లించాలని ఎక్కడా ప్రస్తావించలేదని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement