లెక్క తేల్చండి | Sakshi
Sakshi News home page

లెక్క తేల్చండి

Published Mon, Aug 11 2014 12:32 AM

govt suggest to officers make report ready based on our ward-our town-our plan

సాక్షి, మంచిర్యాల : మున్సిపాలిటీలకు నిధులు అందజేసేందుకు ముందుగా సమస్త సమచారం దగ్గరుండాలనే రాష్ట్రస్థాయి ఆదేశాల మేరకు అధికారులు బిజీ అయ్యారు. ఈ మేరకు జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల అధికారవర్గాలు సమాచార సేకరణలో మునిగాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలతోపాటు నగరపాలక సంస్థల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులతోపాటు నిబంధనలన్నీ పాటిస్తూ అనుమతి పొంది కట్టిన నిర్మాణాలెన్ని, అక్రమ కట్టడాలెన్ని అనే వివరాలను సర్కారు సేకరిస్తోంది.

మన వార్డు-మన పట్టణం-మన ప్రణాళికల ఆధారంగా ఈ నివేదికలను సిద్ధం చేయాలని స్థానిక అధికారులను సూచించింది. అదే సమయంలో రాష్ట్రంలోనూ నివేదికను పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది. ఆయా మున్సిపాలిటీల్లో జరిగిన నిర్మాణాల పూర్తి వివరాలతోపాటు వాటి ద్వారా సమకూరిన మొత్తం వంటి సమస్త వివరాలను తమ ముందుంచాలని పాలకులు ఆదేశించడంతో అధికారులు దస్త్రాల దుమ్ము దులుపుతున్నారు.

 ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
 మన ప్రణాళికలో 16 అంశాలతో కూడిన జాబితాను పురపాలక సంఘాలకు అందజేసింది. ఇందులో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి. అనుమతి లేకుండా ఎ రకమైన అక్రమం చేశారు? ఆయా అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలను అందులో పొందుపరిచారు. భవన నిర్మాణాలకు జారీచేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలు, సెట్‌బ్యాక్‌లు, లేఔట్‌ల ప్రకారం అయిన నిర్మాణాలు, పురపాలక పరిధిలో లేఔట్ అనుమతి లేకుండా వెలిసిన వెంచర్లపై చర్యలు సర్కారుకు వివరించాల్సి ఉంది.

తాజాగా నిర్మాణాల కోసం వచ్చిన దరఖాస్తులు, అందులో అనుమతించినవి, తిరస్కరించినవి పేర్కొనాల్సి ఉంది. భవన నిర్మాణాల ద్వారా వచ్చిన ఫీజులు, అక్రమ నిర్మాణాలకు విధించిన ఫీజులు, తద్వారా సమకూరిన సొమ్ము? వంటి సమస్త వివరాలను పూర్తిస్థాయిలో అందజేయాలని కోరడంతో ఆయా విభాగపు అధికారుల్లో గుబులు మొదలైంది. నిబంధనల ప్రకారం చూస్తే.. అనుమతి లేని నిర్మాణాలు ఉన్నట్లయితే స్థానిక బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 ఈ నేపథ్యంలో ఇంతకాలం అక్రమ నిర్మాణాలు జరగుతుంటే ఏం చేస్తున్నారు అనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతోపాటు మెమో ఇవ్వడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ఆలోచన అధికారుల్లో మెదులుతోంది. ఈ నేపథ్యంలో  అక్రమ నిర్మాణాలను ప్రస్తావిస్తూనే భవిష్యత్తులో ఇబ్బందికాని రీతిలో సమాచారం ఇవ్వాలనే యోచనలో కొందరు అధికారులున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement