Sakshi News home page

కేసీఆర్‌తో హేమంత్‌ సోరేన్‌ భేటీ

Published Thu, Mar 29 2018 2:42 AM

Hemant Soren meeting with KCR - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్‌ సోరేన్‌ సమావేశమయ్యారు. బుధవారం ప్రగతిభవన్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న సీఎం కేసీఆర్‌ ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దీనికి కొనసాగింపుగానే హేమంత్‌ సోరేన్‌ హైదరాబాద్‌ పర్యటన పెట్టుకున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

జేఎంఎం అధినేత శిబూసోరేన్‌తో తెలంగాణ ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక బహిరంగ సభలకు, కార్యక్రమాలకు శిబూసోరేన్‌ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా జేఎంఎంకు టీఆర్‌ఎస్‌తో స్నేహపూరిత సంబంధాలు కొనసాగుతున్నాయి. జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో కీలకంగా వ్యవహరిస్తామనే సంకేతాన్ని ఇవ్వడానికే హేమంత్‌ సోరేన్‌ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసినట్టుగా టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆర్, హేమంత్‌ సోరేన్‌ భేటీ సందర్భంగా జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్మాణానికి అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.  

Advertisement

What’s your opinion

Advertisement