Sakshi News home page

మృత్యుశకటమైన బస్సు

Published Fri, Aug 1 2014 3:18 AM

మృత్యుశకటమైన బస్సు - Sakshi

బెజ్జంకి/గోదావరిఖని/సిరిసిల్ల టౌన్ : తమ సమస్యలు ఉన్నతాధికారులకు విన్నవించుకుందామని వెళ్లిన ఆ యువకుల పాలిట ఆర్టీసీ బస్సు మృత్యుశకటమైంది. బెజ్జంకి మండలం తోటపల్లి-దేవక్కపల్లి వద్ద రాజీవ్ రహదారి బుధవారం అర్ధరాత్రి నెత్తురోడింది. ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సు వేగంగా వచ్చి టవేరాను వెనకనుంచి ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. వీరంతా మీసేవ కేంద్రాల నిర్వాహకులే. గోదావరిఖనికి చెందిన దొమ్మాటి శ్రీధర్(32), ఆర్.రమేశ్, మిర్యాల రవీందర్‌రెడ్డి, ముక్కెర నరేశ్, సిరిసిల్లకు చెందిన జంధ్యాల జయంత్(28), హుస్నాబాద్‌కు చెందిన పి.రాము ఆయూ ప్రాంతాల్లో మీ సేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
 
 హెచ్‌సీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మీసేవ కేంద్రాలకు ఐదు నెలలుగా కమీషన్ చెల్లించకపోవడంతో దాని విషయమై హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించుకునేందుకు మొత్తం ఎనిమిది మంది బుధవారం ఓ టవేరా వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ మంత్రి అందుబాటులో లేకపోవడంతో మీ సేవ డెరైక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించి రాత్రి తిరుగుపయనమయ్యూరు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తోటపల్లి-దేవక్కపల్లి గ్రామాల మధ్య వీరి వాహనాన్ని కరీంనగర్ డిపోకు చెందిన బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. సుమారు 30 గజాల మేర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్లగా డివైడర్ అడ్డుపడి ఆగింది.
 
 వాహనం వెనకసీట్లో కూర్చున్న శ్రీధర్, జయంత్‌కు తీవ్రగాయూలై అక్కడికక్కడే మృతిచెందా రు. రమేశ్, రవీందర్‌రెడ్డి, నరేశ్‌కు తీవ్రగాయూలు కాగా, రాము, డ్రైవర్ శ్రీనివాస్‌కు స్వల్పగాయూలయ్యూరుు. క్షతగాత్రులను స్థానికులు ఫోర్‌లేన్ రహదారి అంబులెన్స్‌లో కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయూలైన రమేశ్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశాడు. కరీంనగర్ రూరల్ సీఐ నరేందర్, బెజ్జంకి ఎస్సైలు ఉపేందర్, రాజమౌళి గురువారం ఆస్పత్రికి చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. శ్రీధర్ తండ్రి రఘుపతిగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 పెళ్లయిన మూడు నెలలకే..
 గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ఆర్.రమేశ్ స్థానిక లక్ష్మీనగర్‌లోని సిటీకేబుల్ కార్యాలయం సమీపంలో విజన్ నెట్‌వర్క్ పేరుతో మీ-సేవ కేంద్రం నిర్వహిస్తున్నాడు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన సరిత(ఇందిర)తో ఏప్రిల్ 20న వివాహమైంది. ఆషాడమాసంలో ఆమె తల్లిగారింటికి వెళ్లగా శ్రావణమాసం మొదలుకావడంతో ఆమెను తిరిగి గోదావరిఖని తీసుకువచ్చేందుకు రమేశ్ సిద్ధమయ్యాడు. మీసేవ కమీషన్ విషయమై డెరైక్టర్‌ను కలిసివద్దామని సహ నిర్వాహకులు కోరడంతో బుధవారం ఉదయం వారితో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలై కానరానిలోకాలకు వెళ్లిపోయాడు. మృతదేహాన్ని గురువారం గోదావరిఖని తీసుకురాగా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్నేహితులు బోరున విలపించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మూడు నెలలకే భర్తను మృత్యువు దూరం చేయడాన్ని తట్టుకోలేని సరిత కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది.
 
 నిద్రపోదామని...
 ఇల్లంతకుంట మండలం కల్లూరుకు చెందిన శ్రీధర్‌గౌడ్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఉపాధి కోసం ఎనిమిదేళ్ల క్రితం గోదావరిఖని వచ్చాడు. ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తూ మార్కండేయకాలనీలో గ్లోబల్ నెట్‌లో మీ-సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి తిరుగుప్రయాణంలో మార్గమధ్యంలో ఓ హోటల్ వద్ద ఆగి భోజనం చేశారు.
 
 అక్కడివరకు వాహనం మధ్య సీట్లో కూర్చున్న శ్రీధర్ ఎదురుగా వాహనాల వెలుతురు పడుతుండడంతో నిద్రపోవాలని భావించి వెనక సీట్లో కూర్చున్నాడు. బస్సు వెనకనుంచి ఢీకొని లాక్కెళ్లడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే కన్నుమూశాడు. శ్రీధర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కల్లూరులో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న గోదావరిఖని ప్రధాన చౌరస్తా ప్రాంతానికి చెందిన రవీందర్‌రెడ్డికి, రమేశ్‌నగర్‌కు చెందిన రమేశ్‌కు చేయి విరిగింది. వాహన డ్రైవర్ ఆరె శ్రీనివాస్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో బాధితులు గోదావరిఖనికి చెందినవారు కావడంతో ఇక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
 
 సిరిసిల్ల సర్దార్‌నగర్‌కు చెందిన గెంట్యాల జయంత్‌కుమార్ లోక్‌సత్తా జిల్లా కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తూ పట్టణంలో మీసేవ కేంద్రా న్ని నిర్వహిస్తున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మీ-తులసీదాస్, భార్య పద్మతో కలిసి సర్దార్‌నగర్‌లో నివాసముంటున్నాడు. అందరితో కలివిడిగా ఉండే జయంత్ మిత్రులతో కలిసి హైదరాబాద్ వెళ్లి రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారి రావడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ స్వచ్ఛంద సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. పట్టణ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
 

Advertisement

What’s your opinion

Advertisement