బంపర్‌ ఆఫర్‌ | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌

Published Fri, Sep 8 2017 10:57 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా

ల్యాండ్‌ బ్యాంక్‌లో ప్రభుత్వ భూములు చేర్చితే నజరానా..!
తహసీల్దార్లకు మెడల్, రూ. పదివేల నగదు పురస్కారం
మూడు కేటగిరీలుగా ల్యాండ్‌ పార్శిళ్ల విభజన
ప్రభుత్వ భూములపై ప్రొఫార్మాలతో నివేదిక 
హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా


సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): ప్రభుత్వ ల్యాండ్‌ బ్యాంక్‌లో గల భూముల పరిరక్షణతో పాటు, నమోదు కాని ప్రభుత్వ భూములపై సైతం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా దృష్టి సారించారు. ల్యాండ్‌ బ్యాంక్‌లో అదనంగా  ప్రభుత్వ భూములు చేర్చితే సద తహసీల్దార్లకు నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. పదివేల నగదుతోపాటు ఉత్తమ మెడల్‌తో  గణతంత్ర దినోత్సవం రోజు  సన్మానిస్తామని ప్రకటించారు. వెబ్‌ల్యాండ్‌లో చేర్చేందుకు వీలుగా అదనంగా ప్రభుత్వ భూములను గుర్తించిన షేక్‌పేట, బండ్లగూడ తహసీల్దార్లను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న భూముల పరిరక్షణ బాధ్యత తహసీల్దార్లదేననని స్పష్టంచేశారు. 

గురువారం ఆమె భూముల పరిరక్షణపై జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంతి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మదన్‌ మోహన్, ఆర్‌డీఓ చంద్రకళలతో కలిసి  తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ల్యాండ్‌ బ్యాంక్‌ను రక్షించాలని,. ప్రభుత్వ భూములను పెంచేందుకు తహసీల్దార్లు కృషి చేయాలని ఆదేశించారు.  ల్యాండ్‌ బ్యాంక్‌లో ని పార్సిళ్లను  ఎ,బి,సి,డి కేటాగిరీలుగా విభజించి  నిర్ణీత ప్రొఫార్మా రూపొందించాలని సూచించారు. ఇందులో కేటగిరి ఏ  కింద లిటిగేషన్‌ లేని 121 ఖాళీ స్ధలాలు వివరాలను  తహసీల్దార్లు స్వయంగా  తనిఖీ చేసి గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఫోటోలు, స్కెచ్‌లను తయారు చేసి  ఈ నెల 16న జరిగే సమీక్షా సమావేశంలో అందజేయాలన్నారను.

తనిఖీ సమయంలో ఆ ల్యాండ్‌ పార్సిల్స్‌లో ప్రభుత్వ భూమి అనే బోర్డు ఉందా..? ఫెన్సింగ్‌ ఉందా?  అనే విషయాలు పరిశీలించి లేని పక్షంలో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. లిటిగేషన్‌లో ఉన్న ఖాళీ స్థలాలను బి కేటగిరి  కింద చేర్చి  ఆ ల్యాండ్‌  పార్సిల్‌కు  సంబంధించిన కోర్టు కేసులు వాటి స్థితి వివరాలు ప్రొఫార్మాలో  పొందుపరచాలన్నారు.  లిటిగేషన్‌ భూముల  తనిఖీ బాధ్యతలను వీఆర్‌వో, వీఆర్‌ఏలకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్‌ను తయారు చేసుకోవాలన్నారు.  

ఆక్రమణల తొలగింపు తప్పనిసరి
 ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్లు  గుర్తించిన పక్షంలో వెంటనే  ఆ వివరాలను  తహసీల్దార్ల ద్వారా ల్యాండ్‌  ప్రొటెక్షన్‌  విభాగానికి  తెలియజేసి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వ పార్సిళ్లలో కట్టడాలను సీ కింద గుర్తించి  వాటిని తహసీల్దార్లు వ్యక్తిగతంగా  తనిఖీ  చేయాలని, ఎంత విస్తీర్ణం  మేర నిర్మాణాల ఉన్నాయి, ఖాళీ స్థలం వివరాలతో నివేదిక సిద్ధం చేసి ఈనెల 23న జరిగే  సమావేశంలో అందజేయాలన్నారు. ఇందుకు సంబందించి అవసరమైన ఫార్మాట్‌ను డిజైన్‌ చేసి పంపనున్నట్లు తెలిపారు.   

త్వరలో తహసీల్దార్‌ ఆఫీసుల తనిఖీ
తహసీల్దార్‌ ఆఫీసులను త్వరలో జాయింట్‌ కలెక్టర్‌తో కలిసి తనిఖీ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అంతకు మందు ఈ నెల 11 నుంచి  అ«ధికారుల బృందం  సందర్శించి  రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణపై సలహాలు, సూచనలు ఇస్తారన్నారు.  సుమారు 259 మంది ఉద్యోగులు వేలి ముద్రలు నమోదు చేయడం లేదని, డిప్యూటేషన్‌పై ఉన్న సిబ్బంది సంబంధిత కార్యాలయాల్లో వేలిముద్రలను నమోదు చేసుకోవాలని సూచించారు. 

Advertisement
Advertisement