'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను' | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'

Published Sat, Mar 14 2015 12:24 PM

'ఎమ్మెల్యేగానే.. ఎమ్మెల్సీగా పోటీ చేయను'

హైదరాబాద్ : ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని... ఎమ్మెల్సీగా పోటీ చేయని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు.  తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా మిత్రులతో తలసాని శ్రీనివాసయాదవ్ చిట్చాట్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కాదా... ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ పదవి చేపడతారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు తలసాని శ్రీనివాస యాదవ్ పైవిధంగా స్పందించారు.

తెలంగాణలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస యాదవ్ మళ్లీ ఎన్నికల పోటీ చేసేందుకు బయపడుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసినట్లు సభలో ప్రకటించాలని ఆయన తలసానికి సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. ఈ అంశాన్ని కూడా శ్రీనివాసయాదవ్ వద్ద మీడియామిత్రులు  ప్రస్తావించారు.

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తలసాని టీడీపీ టిక్కెట్పై గెలుపొందారు. అనంతరం టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే  ఆయన ఇప్పటి వరకు తన రాజీనామాను ఆమోదించుకోలేకపోయారు. దీంతో తలసాని వైఖరిపై పలు రాజకీయ పార్టీల వారు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement