‘మద్దతి’వ్వకుంటే..మిల్లులు మూతే | Sakshi
Sakshi News home page

‘మద్దతి’వ్వకుంటే..మిల్లులు మూతే

Published Wed, May 28 2014 2:17 AM

if not support to rice mills means it will be close

జమ్మికుంట, న్యూస్‌లైన్ : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతు దోపిడీపై వారం రోజులుగా ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. మార్కెట్లో కొనుగోళ్ల తీరును మంగళవారం కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులు తెచ్చే ధాన్యానికి మిల్లర్లు మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను మూసేసేందుకు కూడా వెనకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం ధరలపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో తూకాలు జరుగుతున్నాయా అని అధికారులను ప్రశ్నించారు. రాత్రి వరకు వేలం పాటలు, తూకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 కలెక్టర్ రైతులను ధరల గురించి ప్రశ్నిస్తుండగా మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి కలుగజేసుకోవడంతో రైతులు, టీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. కలెక్టర్ కలుగజేసుకుని రైతులను శాంతిం పజేశారు. కొంతమంది రైతులు ధాన్యం పట్టుకుని కలెక్టర్ ముందుకు రావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని, అడ్డుకునేలా వ్యవహరించవద్దని, తప్పకుండా న్యాయం చేస్తామని పేర్కొన్నారు.  
 
 సమీక్ష సమావేశం..
 ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జేసీ సర్ఫరాజ్  అ హ్మద్ తదితరులతో కలిసి కలెక్టర్ వీరబ్రహ్మ య్య ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం ని ర్వహించారు. ఐకేపీ, సహకార సంఘాల ద్వారా చేపట్టిన ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు కావాలనే ఆటంకాలు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని, ఇలా వ్యవహరించడం సరి కాదని సూచిం చారు. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర చెల్లింపు లు, వ్యాపారంపై విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మిల్లుల్లో ఉన్న నిల్వలపై దశలవారీగా తనిఖీలు నిర్వహిస్తామని, రైతులకు నష్టం కలిగించే మిల్లులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్దతు ధరకే కొనుగోలు చేయాలని సూచించారు.
 
 మగ ధాన్యాన్ని మద్దతు ధరకే అమ్ముకోవాలి..
 జమ్మికుంట మార్కెట్లో మగ రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు కలెక్టర్ అంగీకరించారని, రైతులంతా ఇకపై మద్దతు ధరకు అమ్ముకోవాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సూచించారు. ఇప్పటికే 80 శాతం ధాన్యం వ్యాపారులు కొనుగోలు చేశారని, రైతుల దగ్గరున్న 20 శాతం ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.
 
 సరైన విధంగా మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు చేయకపోవడంతో మొక్కజొన్న రైతులకు మద్దతు ధరలు అందలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికారులు కొనుగోళ్లపై దృష్టి పెట్టకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయని, ఇక రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలు రాకూడదన్నారు. ఈ సమావేశంలో జేసీ సర్ఫరాజ్ అహ్మద్, డీఎస్‌వో చంద్రప్రకాశ్, డీఆఎర్‌డీఏ పీడీ విజయగోపాల్, ఆర్డీవో చంద్రశేఖర్, తహశీల్దార్ సునీత, మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఏడీఏ దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement