సొంత గూటికి.. | Sakshi
Sakshi News home page

సొంత గూటికి..

Published Sun, Aug 30 2015 11:14 PM

సొంత గూటికి.. - Sakshi

కాంగ్రెస్‌లోకి జగ్గారెడ్డి
- నేడు దిగ్విజయ్ సమక్షంలో చేరిక
- భారీఎత్తున జన సమీకరణ
- ఎమ్మెల్సీ బరిలో దింపే అవకాశం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
ఎట్టకేలకు మాజీ ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సొంతగూటికి చేరుతున్నారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి 10 వేల మందితో కలిసి వెళ్లి సత్తా చాటాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన అనుచరులు భారీ జన సమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షునిగా ప్రకటించింది. ఆయన బాధ్యతలు తీసుకోవడానికి సమాయత్తం అవుతుండగానే ప్రకటనను రద్దు చేసింది.

దీంతో ఆయన కొంత మనస్తాపంతో ఉన్న సమయంలోనే మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మరోవైపు జనసేన నాయకుడు పవన్‌కళ్యాణ్ ఒత్తిడి చేయడం చేయడంతో జగ్గారెడ్డి బీజేపీలో చేరారు. ఆపై మెదక్ ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం నెల నుంచే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నం సాగించారు. ఆయన చేరిక పట్ల మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సానుకూలత వ్యక్తం చేసినా.. డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గీతారెడ్డి, దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి తదితరుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో చేరిక ఆలస్యమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి, పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. రాహుల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జగ్గారెడ్డి ఏర్పాట్లను చేసుకున్నారు.
 
ఎమ్మెల్సీగా బరిలోకి..!

త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది.  జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉన్నా... ఎక్కువ మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగ్గారెడ్డిని బరిలోకి దింపితే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement