వడ్డీలేని రుణాలనడం సిగ్గుచేటు | Sakshi
Sakshi News home page

వడ్డీలేని రుణాలనడం సిగ్గుచేటు

Published Fri, Mar 31 2017 1:42 AM

వడ్డీలేని రుణాలనడం సిగ్గుచేటు

సర్కార్‌పై ‘స్త్రీనిధి’ మహిళల మండిపాటు
ఎజెండాను చదవకుండానే ఆమోదించమంటే ఎలాగని ఎండీపై ఆగ్రహం


సాక్షి, హైదరాబాద్‌: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన స్త్రీనిధి బ్యాంక్‌ సర్వసభ్య సమావేశంలో మహిళా సంఘాల సంక్షేమంపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పలువురు మహిళా సమాఖ్యల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు. ఎజెండా అంశాలను ముందుగా తెలపకుండానే, సమావేశంలోనే ఇచ్చి హడావుడిగా ఆమోదం తెలపాలని స్త్రీనిధి బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేర్కొనడాన్ని తప్పుపట్టారు.

వేదికపైన అధ్యక్షురాలు చదువుతున్న అంశాలకు, తమ చేతికి అందించిన ఎజెండా కాపీలోని అంశాలకు పొంతన లేదని మహిళలు దుయ్యబట్టారు. రూ.37.25 కోట్ల ఆదాయం వచ్చిందంటూ ప్రభుత్వానికి రూ.3.48 కోట్ల డివిడెంట్‌ ఇచ్చిన ఎం.డి. విద్యాసాగర్‌రెడ్డి, రూ.2.50 కోట్ల పెట్టుబడి పెట్టిన తమ జిల్లా సమాఖ్యకు ఏడాదిగా వడ్డీని ఎందుకు చెల్లించలేదని నిజామాబాద్‌ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నిలదీశారు.

రెండేళ్లుగా ప్రభుత్వం తన వాటాధనం ఇవ్వకుంటే కిక్కురుమనని అధికారులు, గ్రామ, మండల సమాఖ్యలపై వాటాధనం పేరిట అదనపు భారం మోపడాన్ని పలువురు మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలను చెల్లించేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం, గ్రామ సమాఖ్యల అనుమతి లేకుండానే సహాయకులకు వేతనం ఎలా పెంచిందని ప్రశ్నించారు.

ఉపాధిహామీ పనులకు వెళ్లండి: జూపల్లి
మరోమారు వాటాధనం చెల్లించడం తమకు అదనపు భారమంటున్న గ్రామ సమాఖ్యల ప్రతినిధులకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఉపాధిహామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, కూలీ పనులకు పోతే కుటుంబానికి రూ.15 వేల నుంచి 19 వేల దాకా ఆదాయం వస్తుందని జూపల్లి అన్నారు. త్వరలోనే వడ్డీలను చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి చెప్పారు.

సమావేశం ఆమోదించిన అంశాలివే
l2017–18 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,585 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.225 కోట్ల రుణాలు lపాడి గేదెల కొనుగోలు కోసం రూ.100 కోట్లు రుణంగా అందించాలని నిర్ణయం lసభ్యుల పిల్లలకు సైకిళ్లు, సభ్యులకు స్మార్ట్‌ ఫోన్, ఆటో రిక్షా, ట్రాలీల కొనుగోలుకు రుణాలు lఎస్‌హెచ్‌జీ మహిళల కోసం కొత్త బీమా పథకానికి రూపకల్పన, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4 లక్షలు అందేలా పథకం lగతేడాది కన్నా ఒక శాతం అధికంగా 8 శాతం డివిడెండ్‌ను చెల్లించాలని తీర్మానం lరూ.1,000 రుణానికి రూ.4ల సురక్ష ప్రీమియంను 2.50 రూపాయలకు తగ్గించాలని నిర్ణయం

వార్షిక రుణ లక్ష్యం రూ.1,810 కోట్లు
2017–18 వార్షిక ఏడాది బడ్జెట్‌ను రూ.2,623 కోట్లుగా ప్రతిపాదించామని, ఇందులో వార్షిక రుణ లక్ష్యాన్ని రూ.1,810 కోట్లుగా నిర్ణయించినట్లు విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. 2016–17 సంవత్సరంలో రుణలక్ష్యాన్ని ఇంతవరకు చేరుకోలేకపోయినా వార్షిక రుణలక్ష్యాన్ని 2 9 శాతం పెంచడం పట్ల మహిళా సమాఖ్యల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement