నన్ను క్షమించండి! : కసిరెడ్డి

2 Nov, 2018 11:24 IST|Sakshi
కసిరెడ్డి నారాయణరెడ్డి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తిలో నెలకొన్న టీఆర్‌ఎస్‌ అసమ్మతి కథ సుఖాంతమైంది. నెలన్నర రోజులుగా అనేక మలుపుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వెనక్కి తగ్గారు. కసిరెడ్డి కోసం గతంలో మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి పలుమార్లు చర్చలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం రెండు సార్లు చర్చలు జరపడంతో పాటు స్వయంగా సీఎం కేసీఆర్‌ కూడా ఫోన్‌లో మాట్లాడటంతో ఆయన మెత్తబడ్డారు. కల్వకుర్తిలో గురువరం ఏర్పాటు చేసిన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరు కావడంతో అసమ్మతి సద్గుమణిగినట్లయింది. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతానని, ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ విజయానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

నన్ను క్షమించండి!
ప్రజాఆశీర్వాద సభా వేదికపై కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తనను అభిమానించే నేతలు, కార్యకర్తలు క్షమిం చాలని వేడుకున్నారు. తనకు పార్టీ టికెట్‌ నిరాకరించిన నాటి నుంచి అండగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు నిలిచారన్నారు. వారందరూ కూడా ఎన్నికల బరిలో నిలవాలని పట్టుబట్టినా.. కేసీఆర్‌ ప్రభుత్వం మరోసారి రావాలనే ఆలోచనతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనతో మనసు మార్చుకున్నానని వివరించారు. రైతుల కళ్లలో  ఆనందం నిండాలన్నా.. ఈ ప్రాంతం పచ్చబడాలన్నా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తనను అభిమానించే వారి మనస్సు నొప్పించినందుకు క్షమించాలంటూ కసిరెడ్డి విన్నవించారు.

ప్రచారానికి హాజరయ్యేనా? 
ప్రస్తుతం వెనక్కి తగ్గిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి... పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారా అనేది ఇప్పటికీ టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఆలోచింప చేస్తోంది. ముఖ్యంగా కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నేపథ్యంలో పార్టీ శ్రేణులందరూ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకుపార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహరించిన కసిరెడ్డి మున్ముందు ఎలాంటి పాత్ర పోషించనున్నారనేది నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజా ఆశీర్వాద సభకు కసిరెడ్డి హాజరైనప్పటికీ అతని అనుచరగణం మాత్రం దూరంగా ఉండిపోయింది. తన వర్గంగా ముద్రపడిన వారందరితో కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా కేటీఆర్‌ను కోరినట్లు కసిరెడ్డి సభా వేదికగా ప్రకటించారు. దీంతో కసిరెడ్డి వర్గంతో కేటీఆర్‌ చర్చలు జరిపితే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆగమేఘాలపై ఫ్లెక్సీపై ఫొటో 
ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గైర్హాజరవుతారనే ఉద్దే శంతో స్టేజ్‌పై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఆయన ఫొటో ఏర్పాటు చేయలేదు. కేవలం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత ఫొటోలతో పాటు నియోజకవర్గానికి చెందిన నేతలవి మాత్రమే ముద్రించారు. కసిరెడ్డితో ఉదయం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో పాటు సమావేశానికి కూడా మంత్రి కేటీఆర్‌తో కలిసి వస్తున్నట్లు సభా నిర్వాహకులకు సమాచారం అందింది. దీంతో ఆగమేఘాల మీద కసిరెడ్డి ఫొటోను ఆ ఫ్లెక్సీపై అతికించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు