'పిట్ట కథలతో మోసం చేస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'పిట్ట కథలతో మోసం చేస్తున్నారు'

Published Mon, Sep 4 2017 7:55 PM

kcr wont do any work: krishna sagar

సాక్షి, హైదరాబాద్‌: పిట్టకథలు, మాయమాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలను ఇచ్చి నెరవేర్చకపోవడంతో దళితులు, యువకులు తీవ్ర ఆవేదనకు, మనస్థాపానికి గురై ప్రాణత్యాగాలకు పాల్పడుతున్నారని అన్నారు.

టీఆర్‌ఎస్‌ది దళిత వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని, ఆ భూమికోసం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఇంటిముందు ప్రాణత్యాగాలకు పాల్పడాల్సిన దుస్థితి ఎందుకని కృష్ణసాగర్‌రావు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌పై పెట్టుకున్న ప్రజల ఆశలన్నీ అడియాశలయ్యాయని, గులాబీ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అబద్దాలేనని విమర్శించారు. హామీల సాధనకోసం పోరాడుదామని, ఆత్మత్యాగాలకు పాల్పడొద్దని కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై విచారణ జరిపించాలని, తప్పించుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే రసమయి ప్రజలకు వివరణ ఇవ్వాలని కృష్ణసాగర్‌రావు డిమాండ్‌ చేశారు. గతంలో ఉన్న 10 జిల్లాల్లో పరిపాలన సాధ్యంకాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 31 జిల్లాలను ఎందుకు చేశారో అర్థంకావడం లేదన్నారు. నిర్మలా సీతారామన్‌కు రక్షణశాఖ బాధ్యతలను అప్పగించడంద్వారా మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుందన్నారు. ఎన్డీయేలో టీఆర్‌ఎస్‌ చేరుతున్నదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement