మహిళా భద్రత కోసం చట్టాలకు పదును | Sakshi
Sakshi News home page

మహిళా భద్రత కోసం చట్టాలకు పదును

Published Mon, Sep 30 2019 7:57 AM

Kishan Reddy Speech Amberpet Over Women Protection - Sakshi

సాక్షి, అంబర్‌పేట: మహిళల భద్రత కోసం పటిష్ట చట్టాలు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఫోక్స్‌ చట్టానికి మరింత పదునుపెట్టి పార్లమెంట్‌లో ఆమోదం తెలిపామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఐపీసీ, సీపీసీ చట్టాలను మరింత పటిష్టంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఆదివారం అంబర్‌పేట ఛే నంబర్‌లో మహిళా చైతన్య సదస్సు ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను దేశానికి మంత్రి అయినా అంబర్‌పేట, సికింద్రాబాద్‌ ప్రజల సమస్యలపైనే ఆలోచన ఉంటుందన్నారు.

అందరూ గర్వపడేలా సేవలందిస్తానన్నారు. దేశ అంతర్గత భద్రత అంశాలతో పాటు దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధికి తనకు అవకాశం వచ్చిందన్నారు. 370 ఆర్టికల్‌ రద్దులో తనవంతు పాత్ర ఉండడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించుకోవాలన్నారు. భగవద్గీత ఫౌండేషన్‌ చైర్మన్‌ గంగాధర్‌శాస్త్రి మాట్లాడుతూ... హైందవ ధర్మం అందరికీ మార్గదర్శకంగా ఉంటుందన్నారు.భారతీయుల ఆలోచనలు ఎంతో గొప్పగా, ఇతరులకు ఆదర్శంగా ఉంటాయన్నారు. బతుకమ్మ పండగ వస్తే అన్నగా కిషన్‌రెడ్డి ఉంటారని మహిళా చైతన్య వేదిక ప్రతినిధులు అన్నారు. ఘనంగా ఏర్పాట్లు చేస్తారని పేర్కొన్నారు. వేదిక ప్రతినిధులు అరుణ జ్యోతి, గీతామూర్తి, మాజీ కార్పొరేటర్‌ కన్నె ఉమారాణి, విజయ, బండారు రాధిక, పూర్ణ కల్పన, అమృత తదితరులున్నారు.

ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలి
తార్నాక: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ వాడకంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. తార్నాకలో ఆదివారం భారత్‌ సేవాశ్రమం సంఘ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి కార్యకర్తలకు దుస్తులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ... మనం వినియోగించి పడేసిన ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువులు భూమిలో చేరి భూసారాన్ని తగ్గిస్తున్నాయన్నారు. అలాగే వీటిని తినే పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. గోరక్షణ కోసం ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ‘స్వచ్ఛ భారత్‌’ను ఒక ఉద్యమంలా చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులు మన ఇళ్లలో ఉండే పాత దస్తులతో బ్యాగులు తయారు చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘ్‌ ప్రతినిధులు స్వామి మునిశ్వారానంద, స్వామి వెంకటేశ్వరానంద పాల్గొన్నారు.   

Advertisement
Advertisement