కాంగ్రెస్‌ను పాతరేస్తేనే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే అభివృద్ధి

Published Sat, May 7 2016 4:17 AM

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే అభివృద్ధి - Sakshi

సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా తెలంగాణను వెనకేసిన కాంగ్రెస్‌ను పాతరేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడాన్ని మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ మానవత్వం, సానుభూతి అంటూ కొత్త నాటకానికి తెరతీసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ఏపీ ఎజెండాను మోస్తున్న తెలంగాణ టీడీపీ... కాంగ్రెస్‌కు తోడైందని దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్, టీడీపీలకు ఉమ్మడిగా కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ‘‘సహజ మరణం పొందిన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంపై ఉప ఎన్నికలో పోటీ వ ద్దనడం అర్థరహితం. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్పత్రిలో ఉన్నప్పుడు రూ. కోటి కేటాయించి విదేశాల నుంచి మందులు తెప్పించిన మానవత్వం సీఎం కేసీఆర్‌ది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐకి చెందిన సుజాతనగర్ ఎమ్మెల్యే మహ్మద్ రజబలీ 1996లో మరణిస్తే ఇదే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసినప్పుడు మానవత్వం ఎక్కడికి పోయింది? మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల చేతిలో మరణిస్తే ఆయన భార్య ఉమా మాధవరెడ్డిపై పోటీకి దిగినప్పుడు కాంగ్రెస్ సానుభూతి ఎటుపోయింది? తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మపై పోటీ చేసినప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మానవత్వం ఎక్కడికి పోయింది’’ అని కేటీఆర్ బహిరంగ లేఖలో నిలదీశారు.

టీటీడీపీ నేతలు తెలంగాణ ద్రోహులే..
 ‘‘తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. 2 నెలల కిందట నారాయణఖేడ్ ఉప ఎన్నికలో పోటీ చేసిన టీడీపీకి కొత్తగా సంప్రదాయం గుర్తుకు రావడం చూస్తుంటే కాంగ్రెస్‌కు తోకపార్టీలా మారిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీ పెట్టినప్పట్నుంచి ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు పాతరేసి పాలేరులో మద్దతివ్వడం చూస్తుంటే రాబోయే రోజుల్లో కాబోయే విలీనానికి అద్దం పడుతోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఎన్టీఆర్ ఆత్మకూ పోటు పొడుస్తున్నారు. ఏపీ చేస్తున్న అడ్డగోలు వాదనలకు మద్దతు పలుకుతున్న టీడీపీ నేతలు ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులే’’ అని టీటీడీపీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. జీవనదులు పారుతున్నా, పంటలకు నోచుకోని ఖమ్మం కోసం భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులు మంజూరు చేస్తే వాటిని వ్యతిరేకిస్తున్న టీడీపీ మద్దతు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ పాలేరు ప్రజానీకానికి  క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవకాశవాదంతో అంటకాగుతున్న కాంగ్రెస్, టీడీపీలను పాలేరు ప్రజలు పాతరేస్తారన్న నమ్మకం ఉందని కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement