ఇదేం‘శిక్ష’ణ ? | Sakshi
Sakshi News home page

ఇదేం‘శిక్ష’ణ ?

Published Wed, May 28 2014 3:15 AM

lack of staff shortage in diet college

ఖమ్మం, న్యూస్‌లైన్:  భావి ఉపాధ్యాయులను తయారు చేసే జిల్లా విద్యా శిక్షణ  సంస్థ(డీఐఈటీ)లో బోధించే అధ్యాపకులు కరువయ్యారు. 24 మంది లెక్చరర్లు అవసరం కాగా, ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. దీంతో సకాలంలో సిలబస్ పూర్తి కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేసే అధ్యాపకులను ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపించిన అధికారులు ఇక్కడ కనీస బోధన జరిగేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించడంతో అధ్యాపకులతో కళకళలాడాల్సిన డైట్ నేడు వెలవెలబోతోంది.

 24 మంది అధ్యాపకులకు నలుగురే..
 ఎలిమెంటరీ స్థాయి విద్యాబోధనను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఒక సంవత్సరం నిర్వహించే ఉపాధ్యాయ శిక్షణ  సెంటర్(టీటీసీ)ను మార్పు చేశారు. దీనిని డైట్(డిస్ట్రిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)గా మార్చి రెండు సంవత్సరాల కోర్సుగా చేశారు. ఈ కళాశాలలో వివిధ సబ్జెక్టుల మెథడాలజీతోపాటు మనోవిజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం, ఇతర సామాజిక అంశాలు బోధించడం, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి టీచింగ్ ప్రాక్టిస్, బోధన ప్రణాళికలు సిద్ధం చేయడం మొదలైన పాఠశాల కార్యక్రమాలు, పాఠశాల అనుబంధ కార్యక్రమాలపై తర్ఫీదు ఇస్తారు.

ఇందుకోసం 17 మంది అధ్యాపకులు, ఏడుగురు సీనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌తోపాటు బోధనేతర సిబ్బంది 20 మంది.. మొత్తం 45 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇంతమంది ఉంటేనే విద్యార్థుల పర్యవేక్షణతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే కొంత కాలంగా  డైట్‌లో అధ్యాపకుల నియామకం చేపట్టకపోవడం, ఇక్కడ పనిచేసేవారు ఒక్కొక్కరుగా ఉద్యోగ విరమణ పొందడం, బదిలీ కావడంతో 17 మంది లెక్చరర్లకు గాను ప్రస్తుతం ఇద్దరే మిగిలారు. ఏడుగురు సీనియర్ అధ్యాపకులకు బదులు నలుగురు మాత్రమే ఉన్నారు.

ఇద్దరు సీనియర్ లెక్చరర్లలో బస్వారావు ఖమ్మం డివిజన్ డిప్యూటీఈవోగా అదనపు బాధ్యతలతో బయటకు వచ్చారు. ఉన్న నలుగురు అధ్యాపకులలో సైకాలజీ లెక్చరర్ కమలాకర్‌రావు అనారోగ్యం కారణంగా తరుచూ సెలవులో ఉంటున్నారు. మిగిలిన మరో సీనియర్ లెక్చరర్ రాజేశ్వర్‌రావు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో బోధనకు సీనియర్లు ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు. 24 మంది చేయాల్సిన పని మిగిలిన ముగ్గురు లెక్చరర్లు సత్యనారాయణ, సత్యనారాయణ రాజు, సోమశేఖరశర్మపైనే పడుతుండడంతో వారు కూడా తూతూ మంత్రంగా బోధించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఏ విషయంపైనా సరైన అవగాహన రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

 సకాలంలో పూర్తికాని సిలబస్...
 ఎంతో కష్టపడి ప్రభుత్వ డైట్‌లో సీటు సాధించిన విద్యార్థులకు ఇక్కడికి వచ్చిన తర్వాత చేదు అనుభవం ఎదురవుతోంది. బోధించేవారు సరిపడా లేక సకాలంలో సిలబస్ పూర్తి కాకపోవడం, ఉన్నవారు తూతూ మంత్రంగా పాఠాలు చెపుతుండడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రాక్టికల్ మార్కులు వేసేది అధ్యాపకులే కావడంతో వారు సక్రమంగా బోధించకున్నా విద్యార్థులు మౌనంగా ఉంటున్నారు. అయితే డైట్ పూర్తయిన తర్వాత టెట్, డీఎస్సీ పరీక్షల్లో ఇక్కడ చదివిన మెథడాలజీ, టీచింగ్ అప్టిట్యూడ్, సైకాలజీ, ఇతర సబ్జెక్టుల అంశాలే కీలకం. దీంతో ఇక్కడ ఏదో విధంగా ఉత్తీర్ణత సాధించినా ఆ తర్వాత పరీక్షల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని, డైట్ సెట్‌లో మంచి ర్యాంకు సాధించినా ప్రైవేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement