Sakshi News home page

భక్తజన తీర్థం

Published Fri, Jul 24 2015 2:09 AM

భక్తజన తీర్థం

పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు
పదో రోజు 3 లక్షల మంది రాక
పుణ్యస్నానాలతో మంగపేట, రామన్నగూడెం కళకళ
తప్పని బురద, నడక కష్టాలు

 
హన్మకొండ: గోదావరి పుష్కరాలు రేపే ముగుస్తుండడంతో గోదావరి తీరానికి భక్త జనం పోటెత్తుతోంది. సాధారణ రోజులు, సెలవుదినాలు అని తేడా లేకుండా పల్లెలు, పట్నాల నుంచి ప్రజలు తండోపతండా లుగా తరలివస్తున్నారు. దీంతో మంగపేట, రామన్నగూడెం పుష్కరఘాట్లు తీర్థాన్ని తలపిస్తున్నారుు. పుష్కరాల పదోరోజు గురువారం రామన్నగూడెం, మంగపేట,  పుష్కర ఘాట్ల వద్ద మూడు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటివరకు 20 లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు చేసినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలంగట్లలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు బురదమయమయం కావడంతో వాహనాల పార్కింగ్‌కు  ఇబ్బంది ఏర్పడింది.  పోలీసులు కమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్, బిల్ట్ కర్మాగారంలో అప్పటికప్పుడు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలాల నుంచి భక్తులను పుష్కరఘాట్లకు తరలించే ఉచిత ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు ములుగు డీఎస్పీ రాజమహేంద్రనాయక్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగపేట వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కున్న బస్సులను బయటకు రప్పించి కమలాపురం పంపారు. మరోవైపు జామాయిల్ తోటల్లో పార్క్ చేసిన పలు వాహనాలు బురదలో ఇరుక్కున్నాయి.

 పెరిగిన నీటి ప్రవహాం
 ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. మంగపేట ఘాట్ వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరిగి ఘాట్‌వైపుకు పది అడుగుల మేర ముందుకు వచ్చింది. రామన్నగూడెంలో నీటి ప్రవాహం పెరగడంతో ఇన్ని రోజులుగా నదిలో కుడివైపున ఉన్న పాయలో స్నానాన్ని అధికారులు నిషేధించారు. కేవలం ఘాట్‌కు ఎదురుగా ఉన్న పాయలోనే స్నానానికి అనుమతించారు. ఖమ్మం జిల్లాలో పుష్కరఘాట్ల వద్ద రద్ధీ ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మంగపేటకు చేరుకున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో కొంత మంది భక్తులు చుంచుపల్లి, అకినేపల్లి, కమలాపురం ఇన్‌టేక్ వెల్ వద్ద స్నానాలు చేశారు. శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మంగపేట పుష్కరఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు.
 
 ఉప్పొంగుతున్న గోదావరి
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో గోదావరి ఉప్పొంగుతోంది. బుధవారం 2.40 మీటర్ల నీటి మట్టం ఉండగా గురువారం 2. 65 మీటర్లకు చేరింది. నీటి ఉధృతి గంటగంటకూ పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలవనరులశాఖ రామన్నగూడెం ఘాట్ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్
 తెలిపారు.
 

Advertisement

What’s your opinion

Advertisement